ఏఆర్ రెహమాన్ కు అపూర్వ గౌరవం.. కెనడాలో ఓ వీధికి మ్యుజీషియన్ పేరు

Update: 2022-08-29 14:28 GMT

గ్రామీ, ఆస్కార్ అవార్డుల గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు దేశం కాని దేశంలో.. అరుదైన అపూర్వ గౌరవం దక్కింది. కెనడా ఏఆర్ రెహమాన్ పై తనకున్న గౌరవ భావాన్ని చాటుకుంది. అక్కడ మార్కమ్ అనే చిన్న పట్టణంలోని ఓ వీధికి ఏఆర్ రెహమాన్ పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. 3.3 లక్షల జనాభా ఉన్న ఆ పట్టణం టొరంటోకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓ వీధికి తన పేరు పెట్టడంపై ఏఆర్ రెహమాన్ సంతోషపడ్డారు. ఈ సందర్భంగా మార్కమ్ పట్టణ మేయర్ ఫ్రాంక్ స్కార్ పిట్టికి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక స్టేట్ మెంట్ జారీ చేశారు.

''నేను నా జీవితంలో ఇలాంటిది ఊహించలేదు. నిజంగా మీ అందరికీ, మార్కమ్ మేయర్ ఫ్రాంక్ స్కార్ పిట్టి, కౌన్సిలర్లు, ఇండియన్ కాన్సులేట్ జనరల్ (అపూర్వ శ్రీవాస్తవ), కెనడా ప్రజలకు కృతజ్ఞుడిని. ఏఆర్ రెహమాన్ అన్న పేరు నాది కాదు. దీని అర్థం దయాగుణం. మనందరి ఉమ్మడి దేవుడి గుణం. దీనికి మనం సేవకులం. కనుక ఈ పేరు ప్రశాంతతను, ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని కెనడా ప్రజలకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ దేవుడి దీవెనలు ఉండాలి. భారత్ లో నా పట్ల ప్రేమ చూపించే నా సోదరులు, సోదరీమణులకు సైతం నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎంతో సృజనాత్మకత కలిగిన వారు నాతో కలసి పనిచేసి నన్ను వందేళ్ల సినిమా ప్రపంచంలో సెలబ్రిటీని చేశారు. కానీ, నేను ఈ సముద్రంలో చిన్న బిందువును. విశ్రాంతి తీసుకోకుండా మరింత సేవ చేయాలని, స్ఫూర్తినీయంగా ఉండాలని నాపై బాధ్యతను ఇది పెంచింది'' అని ఏఆర్ రెహమాన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
కాగా.. 2013లోనూ ఏఆర్ రెహమాన్ కు కెనడాలో ఇదే గౌరవం దక్కింది. ఇప్పుడు కెనడాలో రెండు వీధులకు ఏఆర్ రెహమాన్ పేరు ఉంది. తమిళంలో రెహమాన్‌ సంగీతం అందించిన కోబ్రా, పొన్నియిన్‌ సెల్వన్, వెందు తనిందుదు కాడు చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి.


Tags:    

Similar News