అరవింద సమేత సినిమాతో కమెడియన్ గా సునీల్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. త్రివిక్రమ్ స్నేహితుడు కాబట్టి సునీల్ కి కమెడియన్ గా మంచి పాత్ర ఇచ్చి తోడుగా నిలుస్తాడు అనుకున్నారు. సునీల్ కూడా అదే ధీమాతో ఉన్నాడు. హీరోగా ఎన్ని యవ్వారాలు చేసినా చివరికి తన స్నేహితుడు ఉన్నాడనే ధైర్యంతో ఉన్నానని చెప్పాడు కూడా. ఇక హీరోగా అవకాశాలు సన్నగిల్లాక సునీల్ మళ్ళీ స్నేహితుడైన త్రివిక్రమ్ సినిమా అరవింద సమేతలో నీలాంబరికిగా పరిమితిలోనే కామెడీ చెయ్యాల్సి వచ్చింది. కారణం అరవింద సమేత కథలో ఉండే సీరియస్ నెస్ అలాంటిది. అందులో కామెడీకి ఎక్కువగా స్కోప్ లేదు. ఇక తన మరో మిత్రుడు తనకు కలిసొచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల అయినా సునీల్ ని ఆదుకుంటాడనుకున్నారు.
శ్రీను వైట్ల సినిమాలోనూ...
శ్రీను వైట్ల తన సినిమాల్లో పెట్టె కామెడీతో కమెడియన్స్ కి మంచి పేరొస్తుంది. సొంతం, దుబాయ్ శీను, ఢీ వంటి సినిమాలో సునీల్ కి శ్రీను వైట్ల ప్రత్యేకమైన కమెడియన్ పాత్రలిచ్చి నిలబెట్టాడు. ఇక తాజాగా రవితేజ - శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనిలో కూడా సునీల్ కి మళ్లీ ఒక ఫుల్ లెంగ్త్ , ఇంపార్టెంట్ కమెడియన్ క్యారెక్టర్ ఇస్తాడని ప్రచారం జోరుగానే జరిగింది. ఇక సునీల్ కి అమర్ అక్బర్ తో మంచి ఛాన్సెస్ వస్తాయనుకున్నారు. కానీ ఈ సినిమాలో సునీల్ కి పెద్దగా నవ్వించే అవకాశం రాలేదు. చిన్న కామెడీ బిట్స్ తో ఆకట్టుకున్నాడు. కానీ ఆ క్యారెక్టర్ కి అస్సలు పేరే రాదు. మరి ఇలాంటి క్యారెక్టర్స్ సునీల్ ఎలా ఒప్పుకుంటున్నాడో తనకే తెలియాలి. ఎందుకంటే... ఈ సినిమాలో సునీల్ మరీ బొద్దుగా ఎబ్బెట్టుగా ఉన్నాడు. అసలు శ్రీను వైట్ల అండ్ బ్యాచ్ నీకో స్టెప్ ఇస్తాం లేవయ్యా.. అని ఈ సినిమాలో పాత్రకి ఒప్పించి ఉంటారు అనిపిస్తుంది సునీల్ పాత్ర చూసిన వారికీ.
అందుకే ప్రమోషన్స్ కి దూరంగా...
ఇక అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఉన్న కమెడియన్ బ్యాచ్ తో సునీల్ కూడా చేరాడు... కానీ ఎటువంటి ప్రత్యేకతా లేదు. వెన్నెల కిషోర్, సత్య, శ్రీనివాస్ రెడ్డిలతో పాటుగా సునీల్ కనిపించి కాస్త నవ్వించాడు. కానీ సునీల్ మాత్రం ఈ సినిమాలో ఎలాంటి స్పెషల్ కమెడియన్ పాత్ర చెయ్యలేదు. అసలు ఇలాంటి పాత్రలను సునీల్ అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది. కానీ వచ్చిన పాత్రలొదిలేస్తే... కష్టం అని ఒప్పేసుకుంటున్నట్టుగా ఉంది సునీల్ యవ్వారం. ఇక ఈ సినిమాలో సునీల్ తన క్యారెక్టర్ అంతగా పండదని ముందే ఊహించి ఉంటాడు. అందుకే అమర్ అక్బర్ ఆంటోని ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. ఒకవేళ ప్రమోషన్స్ లో పాల్గొని గొప్పలు చెబితే... చివరికి పరువు పోతుందననుకున్నాడో ఏమో..!