ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీ భవిష్యత్ ఏంటి?
జూలై 4న తెలుగు ఓటీటీ ‘ఆహా’లో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ విడుదలవుతుంది – సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్‌బాబు సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా [more]
;
జూలై 4న తెలుగు ఓటీటీ ‘ఆహా’లో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ విడుదలవుతుంది – సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్‌బాబు సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా [more]
జూలై 4న తెలుగు ఓటీటీ ‘ఆహా’లో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ విడుదలవుతుంది – సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్‌బాబు
సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, షాలిని, శీరత్ కపూర్ హీరో హీరోయిన్లుగా రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, సంజయ్ రెడ్డి నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. జూన్ 25న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం హిట్ అయ్యింది. జూలై 4న తెలుగు ఓటీటీ ‘ఆహా’లో విడుదలవుతుంది. ఈ సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్‌బాబుతో ఇంటర్వ్యూ….
‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాకు ఎందుకు సపోర్ట్ చేయాలనిపించింది?
– డైరెక్టర్ రవికాంత్ పేరెపు మాబ్యానర్‌లో ఓ సినిమా చేయడానికి స్క్రిప్ట్ వర్క్ చేశారు. ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఆ సమయంలో తను తన దగ్గర ఓ ఐడియా ఉందని, రానాతో కలిసి వర్క్ చేశానని చెప్పారు. నేను కథ విన్నాను. తర్వాత నేను రానాను కలిసి ఈ సినిమా ఎందుకు చేయాలనుకుంటున్నావని అడిగాను. నా స్నేహితుల్లో కొంత మంది ఇలాంటి సమస్య ఎదురైందని అన్నాడు. అంతే కాకుండా నేటి ట్రెండ్‌కు తగినట్లు ఉండే సినిమా అని తను చెప్పాడు. న్యూ టేక్ అవుతుందనిపించి చేద్దామని అనుకున్నాం. అదే సమయంలో వయాకామ్ సంస్థ కూడా మాతో కలిసి సినిమా చేయాలని అనుకుంటూ ఉండింది. వాళ్లు కూడా ఈ స్క్రిప్ట్ విన్నారు. వాళ్లకి కూడా నచ్చడంతో రవికాంత్‌కు సినిమా చేయమని చెప్పేశాం. రవి తన స్టయిల్లో, తన ఫ్లేవర్‌తో సినిమా చేసుకుంటూ పోయాడు. సినిమా చేసే సమయంలో సిద్ధు జొన్నలగడ్డనే హీరోగా ఎందుకు అనుకున్నావు? అని నేను రవికాంత్‌ను అడిగాను. దానికి తను సిద్దు కూడా ఈ సినిమా రైటింగ్‌లో పార్ట్ అని చెప్పాడు. ఇద్దరూ చాలా కూల్‌గా సినిమాను పూర్తి చేశారు. నేటి జనరేషన్‌కు తగినట్లు ఉండే సినిమా. సినిమా అంతా పూర్తయిన తర్వాత ఏడాది క్రితం నేను ఈ సినిమాను చూశాను. ఈ సినిమా ఓటీటీకి బాగా సరిపోతుందని అప్పుడు చెప్పాను. అయితే రవి, సిద్ధు ఇద్దరూ సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేద్దామని అన్నారు. కానీ తర్వాత ఏం జరిగిందనేది అందరికీ తెలిసిందే.
ఓటీటీకి సరిపోయే సినిమా అని మీకు అనిపించడానికి కారణమేంటి?
– నేను సినిమాకు కుటుంబంతో కలిసి వెళ్లాలనుకుంటాను. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాను మూడు జనరేషన్స్ కుటుంబ సభ్యులు ఒకేసారి చూస్తే ముగ్గురుకి వేర్వేరు అభిప్రాయాలుంటాయి. ఇంట్లో మా ఆవిడ ఈ సినిమాను చూసి మీరేంటి ఇలాంటి సినిమాలను ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? అసలు సోసైటీకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంది. ఒకప్పుడు మా జనరేషన్స్‌కు పోల్చితే, ఇప్పటి జనరేషన్స్‌కు కాస్త కన్‌ఫ్యూజన్ ఉంది. దాన్నే ఈ సినిమాలో చక్కగా ప్రెజంట్ చేశారు.
ఇప్పటికే ఓ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలైన ఈ సినిమాను ఆహాలో విడుదల చేస్తున్నారు.. కదా! ఎలాంటి ఆడియెన్స్‌కు సినిమా రీచ్ అవుతుందని అనుకుంటున్నారు?
– ఇది యంగ్ మూవీ. నేటితరం యువత ఆలోచనలు, వారికుండే కన్‌ఫ్యూజన్స్ గురించి చెప్పే చిత్రమిది. ఒకప్పుడు ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు తరహా సినిమాల్లో ఇలాంటి పాయింట్ టచ్ ఉండేది. కానీ ఇది ఇంకా రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. కాబట్టి యూత్‌కే ఈ సినిమా బాగా నచ్చుతుంది.
‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రాన్ని ఓటీటీ హిట్ అని అంటున్నారు.. ఎలా చెప్పగలరు?
– సాధారణంగా థియేటర్స్‌లో అయితే కలెక్షన్స్‌ను బట్టి సినిమా సక్సెస్‌ను అంచనా వేయవచ్చు. ఇక ఓటీటీ విషయానికి వస్తే సబ్‌స్క్రైబర్స్ సంఖ్య పెరిగే దాన్ని బట్టి సినిమా సక్సెస్‌ను అంచనా వేస్తున్నారు. ఇది నాకు తెలిసిన విషయం. కొన్ని సినిమాలకు వ్యూస్‌ను బట్టి మనకు ఓటీటీ పే చేస్తుంది.
చిన్న సినిమాలకు ఓటీటీ బాగా సపోర్ట్ చేస్తుందని అంటున్నారు.. మీ ఒపినియర్ ఏంటి?
– చిన్న, పెద్ద సినిమాలు అని పెద్దగా ఆలోచించను. ప్రతి ఫ్లాట్‌ఫామ్‌కు ఓ వ్యూవర్‌షిప్ ఉంటుంది. ఓ బడ్జెట్ పరిమితి కూడా ఉంటుంది. దాన్ని బట్టి మేకర్స్ నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకు హిందీలో లక్ష్మీబాంబ్, సడక్ 2 సినిమాలు పెద్ద సినిమాలైనప్పటికీ ఓటీటీలో ప్రేక్షకులను మెప్పించనున్నాయి. అంటే మేకర్స్ నిర్ణయాన్ని బట్టే సినిమా ఓటీటీలో రిలీజ్ కావాలా? వద్దా? అనేది ఫిక్స్ అవుతుంది. ఇంత వరకు ఇదే పద్ధతి,రూల్స్ అనేం చెప్పలేదు.
రెండు ఓటీటీల్లో సినిమాను ఎందుకు విడుదల చేశారు?
– మేం ఓటీటీలో సినిమాను విడుదల చేయాలని అనుకున్నప్పుడు అలాంటి మాట్లాడుకునే ముందుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశాం. తర్వాత ఆహాలో విడుదల చేస్తున్నాం. నెట్‌ఫ్లిక్స్ అంటే ఇంటర్నేషనల్ ఆడియెన్స్‌కు రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఆహా అంటే లోకల్ ఆడియెన్స్‌కు రీచ్ ఎక్కువగా ఉంటుంది. అయితే రెండు ఓటీటీల్లో సినిమాను విడుదల చేయాలనుకోవడం అన్నీ సినిమాకు కుదరదు. ఇలా చేయడం వల్ల బిజినెస్ పరంగా, రీచ్ పరంగా ఉపయోగం ఉంటుంది.
ఇప్పుడు ఆర్జీవీలాంటి దర్శకుడు పే ఫర్ వ్యూ పద్ధతిలో సినిమాను విడుదల చేయడం గురించి మీ అభిప్రాయం?
– రామ్‌గోపాల్ వర్మ కంటెంట్‌ను నచ్చి చూసే ఆడియెన్స్ కొంత మంది ఉన్నారు. అందుకని ఆయన ఏటీటీలో సినిమాను విడుదల చేసుకుంటారు. పే ఫర్ వ్యూలో ఒక వ్యూకి ఇంత మొత్తం చెల్లించి సినిమా చూడాలంటే ప్రతిసారి డబ్బులు చెల్లించి ప్రేక్షకులు సినిమా చూస్తారనుకోలేం. ఆ ప్రాసెసే వేరుగా ఉంటుంది. అలాంటి మేథడ్స్‌లో ఫ్లాట్‌ఫామ్స్ చాలానే వస్తాయి.
ఓటీటీలోకి ఎంతో అనుభవమున్న మీ సంస్థ ఎందుకు ప్రవేశించలేదు?
– అనుభవం ఉంది కదా! అని అన్నీ వ్యాపారాలు చేసేయలేం. ఓటీటీలో లాభాలు కోసమే ఎంటర్ కాకూడదు. డబ్బులు ఎక్కువగా ఉండాలి. వెయిట్ చేసే ఓపిక ఉండాలి. అప్పుడే మనకు ప్రేక్షకులు వస్తారు. ఓటీటీ రంగంలోకి వస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని మేం కూడా ఆలోచించాలి. ఓటీటీలో సబ్‌స్రిప్షన్‌తో వచ్చే డబ్బు, థియేటర్స్‌లో ప్రేక్షకుడు పర్టికులర్ మూవీకి ఇచ్చే డబ్బుతో కంపేర్ చేయకూడదు.
ఈ సినిమా విడుదల చాలా సమయం పట్టినట్లు ఉందిగా?
– నిజానికి మేం కొంత సినిమాను షూట్ చేశాం. తర్వాత స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశాం. అందువల్ల సమయం పట్టింది. ఆ సమయంలో ఓటీటీని దృష్టిలో పెట్టుకుని సినిమాలో మార్పులు చేర్పులు చేయలేదు. రెగ్యులర్ ట్రయంగిల్ లవ్‌స్టోరీని నేటి యూత్ ఆలోచనలకు తగినట్లుగా తెరకెక్కించాం.
షూటింగ్స్‌కు అనుమతులు వచ్చాయి కదా! మీ బ్యానర్‌లో షూటింగ్స్‌ను ఎప్పుడు స్టార్ట్ చేస్తారు?
– కరోనా ప్రభావం పూర్తిగా తగ్గే వరకు నారప్ప, విరాటపర్వం సినిమాలను షూట్ చేయను. మేం షూట్ చేయాల్సిన సీన్స్ అన్నీ ఎక్కువ మంది జనాలతో షూట్ చేయాల్సినవే ఉన్నాయి. 40-50 మందితో షూటింగ్ చేస్తే బాగోదు. సీన్స్‌ను మార్చలేను. అలాగే సినిమా థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు. ఓపెన్ అయినా వెంటనే జనాలు వస్తారో రారో ఇప్పుడే చెప్పలేం. క్రష్ సినిమా టాకీ పార్ట్ అయిపోయింది. నాలుగుసాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. వీటిని జాగ్రత్తలు తీసుకుని పూర్తి చేస్తాం.
వెబ్ సిరీస్ నిర్మించే ఆలోచనలు ఉన్నాయా?
– అవును నేషనల్,లోకల్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చాలా కంటెంట్ సిద్ధం చేశాం. ఇతర సంస్థలతో కలిసి వెబ్ సిరీస్‌లను నిర్మించాలనుకుంటున్నాం. మంచి కథలు చెబితే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీ భవిష్యత్ ఏంటి?
– ఇప్పుడు సినీ రంగానికి చాలా బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఎన్నాళ్లు ఈ పరిస్థితి ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం. ఏడాది పాటు చాలా ఇబ్బందులకు రెడీగా ఉండాలనేది నా అభిప్రాయం. కరోనా మెడిసన్, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మనకు తగ్గిందనే వరకు సినీ ఇండస్ట్రీకి సమస్య ఉంటుంది. సినీ ఇండస్ట్రీకే కాదు..మీడియా, టూరిజం ఇలా చాలా రంగాలు సమస్యలను ఎదుర్కోవాల్సిందే.
ఇకపై సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలపై రానానే నిర్ణయం తీసుకుంటాడా?
– తనే తీసుకుంటాడని చెప్పను. కొన్ని సినిమాలకు నా నిర్ణయం ఉంటుంది. కొన్ని తను డిసైడ్ చేస్తాడు. తను యాక్టర్, స్టూడియో అధినేత, నిర్మాత ఇలా మా నాన్నలా ఈ సురేష్ ప్రొడక్షన్స్‌ను ఇంకా పెద్దది చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. తను ఈ రంగంలోకి ఎంతో ప్యాషన్‌తో వచ్చాడు.
రానా పెళ్లి పనులు ఎంత వరకు వచ్చాయి?
– ఇప్పుడేం పనులుంటాయి. అప్పటి గవర్నమెంట్ రూల్స్‌కు అనుగుణంగా యాబై మందో, పాతిక మందితోనే పెళ్లి చేయాల్సి ఉంటుంది. మామూలుగా అయితే హడావుడి ఉండేది.
అభిరామ్ నెక్ట్స్ ఏమవుతాడు?
– తను యాక్టర్ కావాలనుకుంటున్నాడు. మరి చూడాలి తనేమవుతాడో. మన చేతుల్లో ఏమీ ఉండదు. ప్రయత్నం చేయాలంతే. అభిరామ్ కోసం కొందరు దర్శకులు కథలు రాస్తున్నారు. అయితే ఏదీ ఫైనల్ కాలేదు.
నెపోటిజంపై మీ అభిప్రాయం ఏంటి?
– నెపోటిజం గురించి నేను మాట్లాడను కానీ.. ఎవరికైనా టాలెంట్ ఉండాలి. ఇక సుశాంత్ కోణంలో చూస్తే అతను ఎంతో సాధించాడు. అతను స్టార్ అయ్యాడు. సూపర్‌స్టార్ కావాల్సినవాడు. నెపోటిజం అనేది తెలిసో తెలియకో ఉండొచ్చు. ఆ ప్రభావం సక్సెస్‌పుల్ అయిన వారికీ ఉంటుంది.. కానీ వారికీ ఉంటుంది. ఎవరికీ వారు ప్రూవ్ చేసుకోవాల్సిందే. పెద్ద పెద్ద సూపర్‌స్టార్స్‌కి కూడా రెండు, మూడు సినిమాలు ప్లాప్ అయ్యి రెండు, మూడేళ్లు ఖాళీగా కూర్చున్న సందర్భాలు చాలా ఉన్నాయి. జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి. వాటిని దాటుకుని ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలనేది నేర్చుకోవాలి. తెలుగు విషయానికి వస్తే రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, రాజ్‌తరుణ్ వీరందరూ స్టార్స్ ఎలా అయ్యారు. స్టార్ డైరెక్టర్స్, హీరోల కుటుంబాల్లో హీరోలుగా ట్రై చేసి ఫెయిల్ అయిన వారు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు నేను అభిరామ్‌కు అవకాశం ఇవ్వగలను కానీ.. తనే హీరోగా ఎదగాలి. ఎవరినీ బలవంతం చేయలేం. ప్రేక్షకులకు నచ్చాలి. మనకు ఏదైనా కావాలంటే బలంగా ప్రయత్నించాలి. ఎవరికీ ఏదీ సులభంగా దొరకదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు డి.సురేష్ బాబు.