Eswara Rao : అమెరికాలో తెలుగు నటుడు మరణం..
అమెరికాలో ప్రముఖ టాలీవుడ్ నటుడు మరణించిన వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.;
ప్రముఖ టాలీవుడ్ నటుడు మరణించిన వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన కన్నుమూసిన మూడు రోజులు తరువాత ఇప్పుడు నటుడి మరణవార్త వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే.. స్వర్గం-నరకం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 'ఈశ్వరరావు'. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వరరావు.. హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు.
తల్లి దీవెన, బొమ్మరిల్లు, కన్నవారి ఇల్లు వంటి సినిమాల్లో హీరోగా నటించిన ఈశ్వరరావు.. ప్రేమాభిషేకం, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, ఘరానా మొగుడు వంటి సూపర్ హిట్ సినిమాల్లో ముఖ్య పాత్రలు చేశారు. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించిన ఈశ్వరరావు.. అగ్ర దర్శకులతో, నటులతో కలిసి పని చేశారు.
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈశ్వరరావు చివరిగా ఒక తెలుగు ఛానల్ ఇంటర్వ్యూలో కనిపించారు. ఆ తరువాత అనారోగ్యం కారణంతో అమెరికాలో ఉంటున్న ఆయన కూతురి దగ్గర నివసిస్తున్నారు. అక్టోబర్ 31న ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఈ విషయం చాలా ఆలస్యంగా బయటకి వచ్చింది.