నటుడు పృథ్వీరాజ్ కు ఎదురుదెబ్బ.. నెలకు రూ.8 లక్షల భరణం చెల్లించాలని కోర్టు ఆదేశం
జయవాడకు చెందిన శ్రీలక్ష్మి-పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్ (శేషు)కి ..;
థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న నటుడు పృథ్వీరాజ్ కు విజయవాడ ఫ్యామిలీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అతని భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెలా రూ.8లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి-పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్ (శేషు)కి 1984లో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెళ్లయ్యాక పృథ్వీరాజ్ తనను తరచూ వేధించేవాడని, 5 ఏప్రిల్ 2016లో తనను ఇంటి నుంచి గెంటివేశాడని శ్రీలక్ష్మి తెలిపింది.
అక్కడి నుంచి పుట్టింటికి చేరుకున్నానని పేర్కొంది. 10 జనవరి 2017లో కోర్టును ఆశ్రయిస్తూ.. భర్త నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని కోరారు. పెళ్లయ్యాక పృథ్విరాజ్ తనతో పాటు పుట్టింట్లోనే ఉంటూ చెన్నై వెళ్లి సినిమాల్లో పాత్రల కోసం ప్రయత్నించేవాడని, ఆ ఖర్చులన్నింటినీ తన తల్లిదండ్రులే భరించేవారని పేర్కొన్నారు. సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా పృథ్వీరాజ్ నెలకు రూ. 30 లక్షలు సంపాదిస్తున్నారని, ఆయన నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని కోరారు.
శ్రీలక్ష్మి పిటిషన్ ను విచారించిన విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టు (ఫ్యామిలీకోర్టు) న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని.. శ్రీలక్ష్మికి అనుకూలమైన తీర్పు ఇచ్చారు. ప్రతినెల 10వ తేదీ నాటికి శ్రీలక్ష్మికి రూ.8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించారు. అలాగే ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి అయిన ఖర్చులన్నీ కూడా పృథ్వీరాజ్ చెల్లించాలని తీర్పు ఇచ్చారు.