కోలీవుడ్ లో మరో జంట విడిపోయింది. కమల హాసన్ తో అనుబంధానికి గుడ్ బై చెబుతున్నట్లు నటి గౌతమి ప్రకటించారు. కమల్ తో 13 ఏళ్లు కొనసాగిన బంధం చాలా అద్భుతమైనదని ఆమె కామెంట్ చేశారు. కమల్ తో విడిపోవడం చాలా బాధగా ఉన్నప్పటికీ భవిష్యత్ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తున్నదని ఒకప్పట్లో అగ్రహీరోయిన్లలో ఒకరిగా వెలిగిన గౌతమి పేర్కొనడం విశేషం.
నిడదవోలు సమీపం తాడిమళ్ల గ్రామానికి చెందిన గౌతమి హీరోయిన్ గా 1987లో తన ప్రస్థానం ప్రారంభించారు. 1998 వరకు టాప్ గేర్ లో సినిమాలు చేశారు. 1998లో సందీప్ భాటియాను వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. వారి వైవాహిక బంధం ఏడాది కాలమే కొనసాగింది. తర్వాత విడాకులు తీసుకున్నారు. 2005 నుంచి కమల్ హాసన్ తో అధికారికంగా సహజీవనం చేస్తున్నారు. ఎక్కువగా తమిళ చిత్రాలు చేస్తూ మద్రాసులోనే స్థిరపడిన తెలుగమ్మాయి గౌతమి తెలుగు, కన్నడ, మళయాళ, హిందీ చిత్రాల్లో కూడా నటించారు.
కమల్ తో అపూర్వ సహోదరులు కాలంనుంచి పరిచయం ఉన్న గౌతమి హఠాత్తుగా , లివింగ్ టుగెదర్ రిలేషన్ షిప్ కు ఇక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టేయడానికి కారణాలు ఏమిటో.. దీనిమీద కమల్ ఎలా స్పందిస్తాడో.. అసలు స్పందిస్తాడో లేదో చూడాలి.