వీరసింహారెడ్డి రివ్యూ.. బోయపాటిని మించిపోయిన గోపీచంద్
అప్పటి వరకూ తనకు తండ్రి లేడని అనుకుంటున్న జై సింహాకు తల్లి అసలు విషయం చెబుతుంది. ఇక్కడే వీరసింహారెడ్డి కథ;
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన "వీరసింహారెడ్డి" సినిమా.. నేడు (జనవరి 12) థియేటర్లలో విడుదలైంది. బాలయ్య సినిమాతో.. అభిమానులకు సంక్రాంతి రెండ్రోజుల ముందే వచ్చినట్లైంది. థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అర్థరాత్రి నుండే మాస్ జాతర మొదలైంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమాకు మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఊహించినట్టే.. సినిమాలో బాలయ్య డబుల్ రోల్ లో కనిపించాడు. తండ్రి కొడుకులుగా కనిపించిన బాలకృష్ణ సరసన శృతిహాసన్, హనీరోజ్ జోడీగా నటించారు. కన్నడ స్టార్ నటుడు దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్ మరోసారి నెగిటివ్ రోల్ లో కనిపించింది.
కథ విషయానికొస్తే..
ఈ సినిమా కథ ఇస్తాంబుల్ లో మొదలవుతుంది. తనకొక తండ్రి ఉన్నాడన్న విషయం తెలియనివ్వకుండా కొడుకు జై అలియాస్ జై సింహారెడ్డి (బాలకృష్ణ)ని పెంచుతుంది తల్లి మీనాక్షి(హనీ రోజ్). అనుకోని ఘటనతో జై కు ఈషా (శృతి హాసన్) పరిచయమవుతుంది. వీరిద్దరూ ప్రేమలో పడి.. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఈ విషయాన్ని ఈషా తన తండ్రి తో చెప్పగా.. అందుకు అతను కూడా ఒప్పుకుంటాడు. పెళ్లి సంబంధం గురించి మాట్లాడేందుకు జై తల్లిదండ్రుల్ని ఇంటికి రమ్మని కబురు పెడతాడు.
అప్పటి వరకూ తనకు తండ్రి లేడని అనుకుంటున్న జై సింహాకు తల్లి అసలు విషయం చెబుతుంది. ఇక్కడే వీరసింహారెడ్డి కథ మొదలవుతుంది. కొడుకు పెళ్లి గురించి మాట్లాడేందుకు రావాలని భార్య కబురు పంపగా.. వీరసింహారెడ్డి ఇస్తాంబుల్ కు వెళ్తాడు. ఈ విషయం తెలుసుకున్న విలన్ ప్రతాప్ రెడ్డి (దునియా విలన్) తన భార్య భాను (వరలక్ష్మి శరత్ కుమార్)తో కలిసి వీరసింహారెడ్డిని చంపేందుకు టర్కీకి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది ? భాను.. వీరసింహారెడ్డిను చంపాలనుకునేందుకు గల కారణమేంటి ? తండ్రి గురించి తెలుసుకున్న జై ఏం చేశాడు ? తదితర విషయాలను తెలుసుకోవాలని తెరపై చూడాల్సిందే.
సినిమా ఎలా ఉంది ?
ఫ్యాక్షన్ కథలకు కేరాఫ్ అడ్రస్ అయిన బాలకృష్ణను.. సరిగ్గా అలాగే చూపించడంలో గోపీచంద్ మలినేని సక్సెస్ అయ్యాడు. ఈసారి కేవలం ఫ్యాక్షన్ మాత్రమే కాకుండా.. దానిని చెల్లెలి సెంటిమెంట్ ను జోడించారు. ఊరి బాగుకోసం కత్తి పట్టిన అన్న.. అతడిని చంపి పగ తీర్చుకోవాలని 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న చెల్లెలు.. ఈ పాయింటే కథకు బలం చేకూర్చింది. ఫస్టాఫ్ లో కథ పెద్దగా కనిపించినట్టు ఉండదు. వీరసింహారెడ్డి వచ్చాక.. ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లతో థియేటర్ మోత మోగిపోతుంది.
విలన్ అయిన ప్రతాప్ రెడ్డి.. వీరసింహారెడ్డిపై పదే పదే దండయాత్ర చేయడం.. తుక్కు తుక్కుగా తన్నించుకుని పెళ్లాంతో చివాట్లు తినడం.. ఇదే సాగుతుంది. ఓ పెళ్లివేడుకలో వచ్చే యాక్షన్ ఫైట్ హైలెట్ గా నిలిచింది. కుర్చీలో కూర్చునే.. వీరసింహారెడ్డి ప్రతాప్ రెడ్డి గ్యాంగ్ ను చీల్చి చండాడుతాడు. సెకండాఫ్ లో.. రెండు, మూడు ట్విస్ట్ లతో కథను ఎలివేట్ చేశారు. వీరసింహారెడ్డి తెరపై కనిపించినంత సేపు.. ప్రేక్షకుడు చూపు తిప్పుకోలేడు. బ్రహ్మానందం, అలీ అతిథి పాత్రల్లో మెరిశారు కానీ.. కామెడీ పండలేదు. నవీన్ చంద్ర, ఈశ్వరీరావు, అన్నపూర్ణమ్మ, అజయ్ ఘోర్, మురళీశర్మ ల పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
+ వీరసింహారెడ్డి యాక్షన్
+ఫైట్స్, పాటల
+ పంచ్ డైలాగ్స్
మైనస్ పాయింట్స్
- రొటీన్ యాక్షన్ డ్రామా
- మితిమీరిన హింస