ఎన్జీకే మూవీ రివ్యూ
బ్యానర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నటీనటులు: సూర్య, సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, దేవరాజ్, బాలా సింగ్ తదితరులు సంగీతం: యువన్ శంకర్ రాజా సినిమాటోగ్రఫీ: శివకుమార్ [more]
బ్యానర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నటీనటులు: సూర్య, సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, దేవరాజ్, బాలా సింగ్ తదితరులు సంగీతం: యువన్ శంకర్ రాజా సినిమాటోగ్రఫీ: శివకుమార్ [more]
బ్యానర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
నటీనటులు: సూర్య, సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, దేవరాజ్, బాలా సింగ్ తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: శివకుమార్ విజయన్
ఎడిటింగ్: ప్రవీణ్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సెల్వ రాఘవన్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గజినీ, సింగం సీరీస్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. సూర్య సినిమాలు వస్తున్నాయంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక సూర్య అటు కోలీవుడ్, ఇటు తెలుగులోనూ మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. వరుస ఫ్లాప్స్ తో మార్కెట్ కోల్పోయినా.. సూర్య సినిమాలంటే ప్రేక్షకులకు ఇంట్రెస్ట్. అందులోనూ సింగం సిరీస్ లో సూర్య పోలీస్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మధ్యలో గ్యాంగ్ లాంటి చెత్త సినిమాలు చేసినా ప్రస్తుతం ఎన్జీకే సినిమా మీద ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ ఉంది. సూర్య.. 7/జి బృందావన్ కాలనీ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో టాప్ హీరోయిన్స్ అయిన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవిలతో కలిసి ఎన్జీకే సినిమా చేసాడు. మరి ఈ సినిమా విజయంపై సూర్య ఎన్జీకే ప్రమోషన్స్ లో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. సూర్య అనుకున్నట్టుగా ఎన్జీకే సినిమా హిట్టా? లేదా ఫట్టా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ
ఎన్జీకేగా పిలవబడే నందగోపాలకృష్ణ(సూర్య) ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. ఎంటెక్ చదివిన అతనికి ఆ జాబ్ కంటే ఆర్గానిక్ వ్యవసాయంపైన, ప్రజలకు సేవ చేయడంపైన ఆసక్తి ఎక్కువ. ఆ ఆసక్తితోనే జాబ్‌కి రిజైన్ చేసి ఊరికి వచ్చేస్తాడు. ఆర్గానిక్ వ్యయసాయం పట్ల ఆ ఊరి రైతులను చైతన్యవంతుల్ని చేస్తాడు. కొంతమంది యువకులతో కలిసి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తుంటాడు. ఇది కొంతమంది పెద్దలకు నచ్చదు. రైతులకు అప్పులిచ్చి వడ్డీలకు చక్రవడ్డీలు లాగుతూ పబ్బం గడుపుకునే ఆ గ్యాంగ్ ఎన్జీకేకు వార్నింగ్ ఇస్తుంది. అయినా అతను తన పద్ధతి మార్చుకోడు. దీంతో ఊరి జనంపై దాడికి దిగుతుంది ఆ గ్యాంగ్. తన వల్ల జనం నష్టపోవడం ఇష్టం లేని ఎన్జీకే ఒక శ్రేయోభిలాషి సలహా మేరకు ఆ ఏరియా ఎమ్మెల్యేను కలుస్తాడు. తమవారిపై జరుగుతున్న దాడులను ఆపించాలని రిక్వెస్ట్ చేస్తాడు. ఒక్క ఫోన్ కాల్‌తో అవన్నీ ఆపిస్తాడు ఎమ్మెల్యే. తను చేసిన సాయానికి బదులుగా తనకు ఏం చేస్తావని అడుగుతాడు. అయితే ఎన్జీకేతో పాటు 500 మంది ఆ పార్టీలో చేరతారని అతని స్నేహితుడు చెప్తాడు. చెప్పినట్టుగానే అందరూ పార్టీలో చేరతారు. ఎమ్మెల్యే చెప్పిన పనల్లా చేస్తూ అతని దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు ఎన్జీకే. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లోకి వెళ్లడం ఒక్కటే మార్గం అని తెలుసుకున్న ఎన్జీకే ఆ దిశగా తన ప్రయత్నాలు మొదలుపెడతాడు. మరి రాజకీయంగా ఎలా ఎదిగాడు? రాజకీయాల వల్ల ఎన్జీకే నష్టపోయిందేమిటి? ఎన్జీకే వ్యవసాయాన్ని వదిలేసాడా? ఇన్ని విషయాలు తెలియాలంటే సినిమాని వెండితెర మీద చూడాల్సిందే.
నటీనటుల నటన
ఎన్జీకే సినిమాకి సూర్య నటనే మెయిన్ హైలెట్. సూర్య ఎన్జీకే పాత్రలో అంతగా ఒదిగిపోయాడు. అటు వ్యవసాయదారుడిగా, ఇటు రాజకీయ నాయకుడిగా సూర్య నటన అద్భుతమే. ఇక సూర్య భార్య పాత్రలో సాయి పల్లవి నటించింది. ఆమె పాత్రలో సహజత్వం ఆకట్టుకున్నా… ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానం మాత్రం ఆకట్టుకునేలా లేదు. ఇక మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర పరిధి తక్కువే. కానీ రకుల్ ఉన్నంతలో తన నటనతో ఆకట్టుకుంది. ఇక సినిమాలో మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవల్సిందేమీ లేదు.
విశ్లేషణ
ఒక సామాన్యమైన యువకుడు పెద్ద ఉద్యోగాన్ని వదిలేసి… ఆర్గానిక్ వ్యవసాయాన్ని చేస్తూ లోకల్ గ్యాంగ్ తో తలపడుతూ… రాజకీయ రణరంగంలో ఎత్తులు, పైఎత్తుల్ని దీటుగా ఎదుర్కొంటూ ఎదిగిన వైనమే ఈ చిత్ర కథ. సెల్వ రాఘవన్ తన మార్క్ స్క్రీన్‌ప్లేతో కొత్తగా ఆ కథని చెప్పే ప్రయత్నం చేసాడు. సినిమా మొదటి నుంచి చివరి వరకు సూర్య హుషారైన నటన, ఇమేజే సినిమాకి దిక్కైంది అని చెప్పాలి. కిందిస్థాయి రాజకీయాల నుంచి ఈ కథ మొదలవుతుంది. క్రమంగా పైస్థాయి రాజకీయాల్ని ప్రతిబింబిస్తూ కథ సాగుతుంది. సినిమాలోని పాత్రల పరిచయానికి, కథకి ప్రేక్షకుడు కనెక్ట్ కావడానికి చాలా సమయం పడుతుంది. దీంతో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపించినప్పటికీ.. ఎన్జీకే కుటుంబ నేపథ్యం, లోకల్ రాజకీయాలు ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్నిచ్చాయి. కానీ సెకండ్ హాఫ్ లో చెప్పాల్సిందేమీ లేకపోవడం, కథనంలో సత్తా లేకపోవడంతో సన్నివేశాలన్నీ సాగదీతగా మారిపోయి శుభం కార్డు ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసేలా చేస్తాయి. ఇక ఎన్జీకే భార్యగా క్యారెక్టర్‌ని సాయిపల్లవే చెయ్యక్కర్లేదు ఎవరు చేసినా ఒకటే. ఎందుకంటే ఎలాంటి ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ అది. సాయిపల్లవిని పెట్టుకున్నాం కాబట్టి కొన్ని డైలాగ్స్ ఉండాలి అన్నట్టుగా అర్థం పర్థం లేని కొన్ని డైలాగులు ఆమెతో చెప్పించారు. ఆ సీన్స్ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి. సెల్వ రాఘవన్ సినిమాలంటే సమాజంలో ఉండే వ్యక్తులు మరియు పాత్రలను అంతా నాచురల్ గా చూపించేవాడు. కానీ ఈ సినిమాలో అంత నాచురాలిటీ మిస్సయ్యినట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్ లో కథ మెల్లిగా సాగినా సెల్వ రాఘవన్ తన కథనంతో పొలిటికల్ జానర్ లోకి కాస్త ఆసక్తికరంగా తీసుకెళ్లి తడబడినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్ లో కూడా ఏమంత కొత్తదనం లేకపోవడం, అక్కడక్కడా సాగదీతగా అనిపించినా క్లైమాక్స్ మాత్రం పర్వాలేదనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్: సూర్య నటన, కొన్ని పొలిటికల్ సీన్స్
మైనస్ పాయింట్స్: కథలో గందర గోళం, సాయి పల్లవి కేరెక్టర్, సెకండ్ హాఫ్, సాగదీత సన్నివేశాలు
రేటింగ్: 1.75/5