మాచర్ల నియోజకవర్గం రివ్యూ: కొత్త డైరెక్టర్ నుండి వచ్చిన రొటీన్ సినిమా
మాచర్ల నియోజకవర్గం రివ్యూ
కొత్త డైరెక్టర్ నుండి సినిమా వస్తోందంటే ఏదో కొంత కొత్తను ఆశిస్తారు ఆడియన్స్. జనం మాస్ సినిమాలకు ఒకప్పుడు అలవాటు పడినట్లుగా ఇప్పుడు ఏ సినిమా వచ్చినా చూసేయాలని అనుకోవడం లేదు. అఖండ, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, విక్రమ్ రేంజి ఎలివేషన్స్ చూసిన సినీ ప్రియులకు చిన్న హీరోలు చేసే మాస్ ఫైట్స్ కొంచెం కూడా రుచించకపోవచ్చు. కొత్తదనం ఉన్నా కూడా సినిమా థియేటర్లకు ఆడియన్స్ ను రప్పించడం గగనం అయింది. అలాంటిది రొటీన్ సినిమాను వేసుకొని వస్తే సినిమాను చూడడానికి కాదు కదా.. థియేటర్ల వద్దకు రావడమే మానేసే అవకాశాలు ఉన్నాయి.
టైటిల్: మాచర్ల నియోజకవర్గం
తారాగణం: నితిన్, కృతి శెట్టి, కేథరీన్, సముద్రఖని, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజి, మురళిశర్మ, రాజేంద్రప్రసాద్ తదితరులు
కెమెరా: ప్రసాద్ మూరెళ్ల
సంగీతం: మహతి స్వర సాగర్
ఎడిటింగ్: కోటగిరి
నిర్మాత: సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి
దర్శకత్వం: ఎం. ఎస్. రాజశేఖర్ రెడ్డి
విడుదల తేదీ: 12 ఆగష్ట్ 2022
కథ: మాచర్ల నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలలో ఎన్నికలన్నవే జరగవు. అక్కడ ఉన్న ఓ పెద్దాయన ఎన్నికలను జరగనివ్వకుండా.. ఏకగ్రీవంగా గెలుస్తూ వస్తుంటారు. ఆ పెద్దాయన పేరు రాజప్ప(సముద్రఖని).. అడ్డు వచ్చిన వాళ్లను చంపుకుంటూ.. ఎలెక్షన్స్ పెడతానన్న గవర్నమెంట్ ఆఫీసర్లను వేసుకుంటూ వెళ్లే విలన్. ఇక వైజాగ్ వచ్చిన హీరోయిన్ కారణంగా మాచర్లకు హీరో సిద్ధు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ హీరో విలన్ అండ్ గ్యాంగ్ తో తలబడి విజయం సాధించాడా లేదా..? ఎన్నికలు మాచర్లలో జరిగాయా లేదా అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది.
సినిమా ఎలా ఉందంటే..?
సినిమా మొదలైనప్పటి నుండి ఒకటే రొటీన్ సీన్లు.. కొంచెం కూడా మనకు కొత్త అనేదే కనిపించదు. వారియర్, టక్ జగదీశ్.. అంతకు ముందు వచ్చిన ఒక పాతిక.. 50 సినిమాలలోని సీన్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. పాలిటిక్స్, కామెడీని మిక్స్ చేసే ప్రయత్నం చేశాడు కొత్త దర్శకుడు ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి. రెగ్యూలర్ రొటీన్ ఫార్ములాతో 'మాచర్ల నియోజకవర్గం' వచ్చేసింది. ఎప్పుడూ చూసే ఎలెక్షన్స్ సీన్స్ తో సెకండాఫ్ లో ఆడియన్స్ కు బోర్ కొట్టేలా చేయించాడు. అయితే ఇందులో నితిన్‌ను మాత్రమే కొత్తగా చూపించారు. సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. కొత్త వంటగాడు వచ్చి పాత చింతకాయ పచ్చడి చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. ఆయా పాత్రలకు తగ్గట్టుగా నటులు న్యాయం చేశారు. కథ, స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ లేకపోవడంతో నీరసంగానే సినిమా హాల్ నుండి ఆడియన్స్ బయటకు వస్తారు.