నటీ నటులు: నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్యా హోప్
మ్యూజిక్ డైరెక్టర్: సాయి కార్తీక్
నిర్మాత: ప్రశాంతి, కృష్ణ విజయ్
దర్శకుడు: సాగర్. కె. చంద్ర
ఈ ఏడాది చివరిలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో నారా రోహిత్ - శ్రీ విష్ణు నటించిన 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రమొకటి. ఈ చిత్రంలో నారా రోహిత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక నారా రోహిత్ బెస్ట్ ఫ్రెండ్ శ్రీ విష్ణు నారా రోహిత్ కి సరి సమానమైన పాత్ర కాకుండా ఇంకా లీడ్ రోల్ లో ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ఇప్పటి వరకు నారా రోహిత్ ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలే చేసాడు. అయితే కొన్ని సినిమాలు యావరేజ్ హిట్స్ తో నటనలో పర్వాలేదనిపించిన రోహిత్ కి నటుడిగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి కొన్ని సినిమాలు. వాటిలో 'సోలో, బాణం, ప్రతినిధి, జ్యో అచ్యుతానంద' చిత్రాలు ఉన్నాయి. ఇక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రమైన నారా రోహిత్ కి సూపర్ హిట్ విజయాన్ని సాధించి పెడుతుందో లేదో చూద్దాం. ఇక దర్శకుడు సాగర్ కె చంద్ర రొటీన్ స్టోరీస్ మీద ఆధారపడకుండా ఒక కొత్త కథని తీసుకుని ఈ సినిమా చేసినట్లు మనకు ట్రైలర్స్ లో టీజర్స్ లో అర్ధమైపోయింది. రెండు విభిన్న మనస్తత్వాలతో కూడుకున్న వ్యక్తుల ఏ విధం గా తమ జీవితంలో ముందుగు సాగుతారో అనే భిన్నమైన పవర్ ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ: 1990 లో మొదలయ్యే కథలో క్రికెటర్ రాజు( శ్రీ విష్ణు) రైల్వే కాలనిలో నివసిస్తూంటాడు. రాజు వర్ధమాన క్రికెటర్ గా క్రికెట్ లో వెలుగొందుతుంటాడు. రైల్వే రాజు ఒక అమ్మాయిని ఘాడం గా ప్రేమిస్తాడు ఆమె తాన్యా. ఆమెతో లవ్ లో ఉంటూనే క్రికెటర్గా రంజిలోను రాజు హవా కొనసాగిస్తుంటాడు. జీవితం సంతోషంగా గడిచిపోతున్న క్రమంలో అనుకోని కారణాల వల్ల పోలీస్ ఆఫీసర్ ఇంతియాజ్ అలీ (నారా రోహి) మారు వేషంలో వచ్చిక్రికెటర్ రాజుని అరెస్ట్ చేస్తాడు. ఆ అవమానం భరించలేని రాజు ఇంతియాజ్ అలీ పై కక్ష పెంచుకుంటాడు. కావాలనే క్రిమినల్ గా మారి ఇంతియాజ్ అలీ పై పగ తీర్చుకోవడానికి అదును కోసం కాచుక్కూర్చుంటాడు. వీరిద్దరి మధ్య పగ తీవ్ర రూపం దాలుస్తుంది. రైల్వే రాజు కాస్తా రౌడీ రాజుగా యు టర్న్ తీసుకున్న రాజు ఇంతియాజ్ అలీ పై కక్ష సాధించాడా? రాజు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడాడా? అసలీ ఇంతియాజ్ అలీ కి రాజు పై ఎందుకంత పగ? మాములు క్రికెటర్ గా వున్న రాజు ఎందుకు రౌడీగా మారాడు? ఇవన్నీ తెలియాలంటే తెర మీద సినిమాని వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు: పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నారా రోహిత్ బాగా సెట్ అయ్యాడనే చెప్పాలి. అతి నిజాయితీ పరుడైన పోలీస్ అధికారి ఎదుర్కున్న సవాళ్లు రోహిత్ నిజమైన పోలీస్ లా ఎదుర్కొంటున్నట్లు అనిపించింది. విలక్షణ నటనకు రోహిత్ కి మంచి పేరుంది. ఇక ఈ చిత్రం లో విలక్షణ నటనతో రోహిత్ అరిపించేసాడు ఇక రోహిత్ బెస్ట్ ఫ్రెండ్ శ్రీ విష్ణు మొదటిసారి హీరోగా చేసాడు. అయినా నటనలో శెభాష్ అనిపించాడు. శ్రీ విష్ణు రైల్వే రాజు పాత్రలో బాగా నటించాడు. ఒక వర్ధమాన క్రికెర్ గా కూడా రాజు బాగానే తన పాత్రలో ఒదిగిపోయాడు. ఢీ అంటే ఢీ అని రోహిత్, శ్రీ విష్ణు ఇద్దరూ చాలా చక్కగా నటించారు. ఇక హీరోయిన్ తాన్యా హోప్ తన పరిధిమేర పర్వాలేదనిపించింది. ఇక ఒక బిజినెస్ మాన్ గా రాజీవ్ కనకాల అలరించాడు. బ్రహ్మజీ తన పరిధిమేర నటించాడు.
సాంకేతిక వర్గం: ముందుగా దర్శకుడు సాగర్ కె చంద్ర గురించి చెప్పుకోవాలి. రెండు భిన్న మనస్తత్వాలున్న రోహిత్, శ్రీ విష్ణుల పాత్రలను బాగా డిజైన్ చేసాడు. ఒక కేరెక్టర్ ని నిజాయితీపరుడుగా, మరో కేరెక్టర్ ని అమాయకపు ప్రపంచం నుండి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా చూపించి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. రొటీన్ కథలకి దూరంగా భిన్నమైన కథని ఎంచుకుని దర్శకుడు సాగర్ కె చంద్ర కొత్తగా ఆలోచించాడు. 1990 నేటివిటీకి దగ్గరగా చూపించిన అది పెద్దగా వర్కౌట్ అయినట్లు కనబడదు. స్క్రీన్ ప్లే కొత్తగా అనిపించింది. ఇక పాటల విషయంలో సాయి కార్తీక్ రొటీన్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. ఇక ఎడిటింగ్ విషయానికొస్తే కోటగిరి మంచి ఎడిటింగ్ ఇచ్చాడు.
ప్లస్ పాయింట్స్: నారా రోహిత్, శ్రీ విష్ణు, డైరెక్షన్, కథ, సెకండ్ హాఫ్, క్లైమాక్స్
మైనస్ పాయింట్స్: పాటలు, స్లో నేరేషన్