నటీనటులు : రావు రమేష్, హెబ్బా పటేల్, తేజస్వి మదివాడ, అశ్విన్ బాబు, నోయెల్ సీన్, నూకరాజు తదితరులు
కథ : బి.సాయి కృష్ణ
కథనం: ప్రసన్న కుమార్ బెజవాడ
కూర్పు: చోట కె ప్రసాద్
ఛాయాగ్రహణం: చోట కె నాయుడు
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాత : బెక్కెం వేణు గోపాల్
దర్శకత్వం: భాస్కర్ బండి
నిర్మాణ సంస్థ: లక్కీ మీడియా
విడుదల : దిల్ రాజు
ఆలా ఎలా, కుమారి 21 ఎఫ్, ఇదో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాలతో వరుసగా సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతున్న హెబ్బా పటేల్ నటించిన చిత్రంగా తప్ప ఇంకో కోణంలో ఈ చిత్రం గురించి మాట్లాడుకోవడానికి కూడా ఎం లేదు కొద్ది కాలం క్రితం వరకు. కానీ ఒకసారి ట్రైలర్ విడుదల తరువాత నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ చిత్రానికి అనూహ్యంగా క్రేజ్ పెరిగిపోయింది. ప్రచార చిత్రంలో హెబ్బా పటేల్, తేజస్విల గ్లామర్, ముగ్గురు కుర్ర నటుల సందడితో పాటు రావు రమేష్ పలికిన సంభాషణలు, హావభావాలు ప్రేక్షకులను బాగా కదిలించాయి. ఇంతలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో పంపిణి హక్కులు పొంది ఆయానే స్వయంగా విడుదల చేయటంతో చిత్రంపై ప్రత్యేక అంచనాలు ఏర్పడ్డాయి. మరి నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ ఆ అంచనాలు అందుకుంటుందో లేదో పరిశీలిద్దాం.
కథ: పల్లెటూరి వాతావరణంలో తండ్రి అతి గారాబంతో పెరిగిన హెబ్బా పటేల్ కొంత కాలం తండ్రి రావు రమేష్ కి దూరం గా ఉండాల్సి వచ్చినప్పుడు తమ ఊరిలోలా పద్ధతిగా కాక తన సహజ శైలికి విరుద్ధంగా గడపటానికి నిశ్చయించుకుంటుంది. ఈ విషయంలో హెబ్బా పటేల్ కి తన సలహాలు సూచనలతో సహకారం అందిస్తుంటుంది తేజస్వి మదివాడ. ఈ క్రమంలో హెబ్బా పటేల్ ముగ్గురు సిటీ కుర్రాళ్లను వెతుక్కుని ఒకరికి తెలియకుండా ఒకరిని గా మొత్తం ముగ్గురిని తన బాయ్ ఫ్రెండ్స్ గా స్వీకరిస్తుంది. ఏదో కాసింత కొత్త పంథా కోసం చేసిన ప్రయత్నంలో ఒకానొక సందర్భంలో ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ మధ్య తాను నలిగిపోతుందో లేక తన ఆలోచనల వల్ల ఆ ముగ్గురు యువకులు అశ్విన్ బాబు, నోయెల్, నూకరాజు లను ఇరకాటంలో పడేస్తుందో తేల్చుకోలేని స్థితికి చేరిపోయిన హెబ్బా పటేల్, ఈ తతంగానికి ముగింపు పలకాలని ఉద్దేశంతో ముగ్గురికి తాను తీసుకున్న తప్పుడు నిర్ణయం గురించి వివరిస్తుంది. దీనితో పరిస్థితి చక్కబడకపోగా హెబ్బా పటేల్ ను మరింత ఇరకాటంలో పడేస్తుంది. ఇంతలో తన కూతురు చేసిన ఘోరాన్ని తెలుసుకున్న రావు రమేష్ కుంగిపోతూ కూడా కూతురి శ్రేయస్సు ఆలోచించే తండ్రిగా ఎం చేసాడు? ఇంతకీ హెబ్బా పటేల్ ఎవరిని మనువాడింది అనేది మిగిలిన కథ.
విశ్లేషణ : నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ చిత్రం పేరు చెప్పగానే ఎవరైనా మాట్లాడుకోవాల్సింది రావు రమేష్ నటన గురించే. తన నటనను ఇప్పటికే పలు మార్లు అనేక చిత్రాల ద్వారా నిరూపించుకున్న రావు రమేష్ కు రెగ్యులర్ తండ్రి పాత్ర కాక నటనకు అవకాశం ఎక్కువ వున్నా పాత్ర దొరకటం, ఆ పాత్ర లో రావు రమేష్ ఇమిడిపోయి నటించి తాను తప్ప మేకర్స్ కి ఆ పాత్రకు వేరే ఛాయిస్ లేదు అనే విధంగా నటించి మెప్పించాడు. పైగా కథలో చాలా కీలకమైన పాత్ర కావటంతో రావు రమేష్ నటన సినిమాకి ప్రధాన బలం గా నిలిచింది. బబ్లీ పెర్ఫార్మన్స్ లతో పాటు సెంటిమెంట్ సన్నివేశాలలోను తన నటన ప్రూవ్ చేసుకుంది హెబ్బా పటేల్. చిత్రం మొత్తం హెబ్బా పటేల్ కి తోడుగా వుంటూ ఎక్కువ నిడివిలో కనిపించిన తేజస్వి మదివాడ తో పాటు అశ్విన్ బాబు, నోయెల్, నూకరాజు వారి పాత్రలకు న్యాయం చేశారు.
కథ పరంగా సరదాగా సాగే జీవితాల ప్రయాణం ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొందో తెలియజెప్పే కథలో సగటు ప్రేక్షకుడు తృప్తి చెందే అన్ని అంశాలను సమపాళ్లలో సమకూర్చి, ఏది బలవంతంగా జోడించినట్టు అనిపించకుండా జాగ్రత్తలు తీసుకుని కథ సిద్ధం చేశారు సాయి కృష్ణ. అయితే కథలో వున్నా పట్టు కొంత కథనం లోని లోపాల వలన కొంత దెబ్బతినట్టుగా అనిపిస్తుంది. సెంటిమెంట్ సన్నివేశాల ప్లేసెమెంట్ తో పాటు వాటి నిడివి పై కూడా దృష్టి పెట్టక కథనం కొంచం మందగించింది అని చెప్పొచ్చు. కథ టేక్ ఆఫ్ తీసుకున్నప్పటి నుంచి ద్వితీయార్ధం వరకు కథనం ప్రేక్షకులను అలరించింది. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోట.కె.నాయుడు ఛాయాగ్రహణం విజువల్స్ అద్భుతంగా ప్రేక్షకుడికి రిజిస్టర్ కావటానికి బాగా దోహద పడింది. చిత్రంలోని పాటలు క్యాచీ ట్యూన్స్ తో శ్రోతల పెదాలపై దొర్లటంతో పాటు నేపధ్య సంగీతం ప్రేక్షకుడిని నిత్యం కథ లోని భావోద్వేగంతో ప్రయాణం చేయిస్తూ చిత్ర స్థాయిని ఒక మెట్టు ఎక్కించింది. ఎడిటర్ కట్స్ ఇంకా కొంచం పదునుగా వుంది ఉంటే ద్వితీయార్ధంలో వచ్చే తండ్రి కూతుర్ల మధ్య సెంటిమెంట్ సన్నివేశాలను కూడా ప్రేక్షకుడు ఇంకా ఎక్కువ ఆస్వాదించే అవకాశం ఉండి ఉండేది. దర్శకుడు కథనం పై ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించే విధంగా తెరకెక్కి ఉండేది. సహజ నిడివితోనే తెరకెక్కినప్పటికీ కొన్ని ఏడుపు సన్నివేశాలు కథనంలో లాగ్ ని పెంచుతూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించాయి.
ప్లస్ పాయింట్స్:
రావు రమేష్, హెబ్బా పటేల్ ల పెర్ఫార్మన్స్
ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయకలిగిన అంశాలతో కూడిన కథ
ఛాయాగ్రహణం
సంగీతం
మైనస్ పాయింట్స్:
ద్వితీయార్ధంలో బలహీనపడ్డ కథనం
ఎడిటింగ్
దర్శకత్వం
రేటింగ్ : 2.75/5