ప్రచారం ఎలా...?
ఇండియా కూటమి సమన్వయ కమిటీ సమావేశం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగింది.
ఇండియా కూటమి సమన్వయ కమిటీ సమావేశం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగింది. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ప్రధానంగా కొన్ని అంశాలపై కో-ఆర్డినేషన్ కమిటీ చర్చించింది. లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం కావాలని కూటమిలోని కో-ఆర్డినేషన్ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడు పరుగెట్టడం కంటే ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం కార్యాచరణను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లడం మంచిదని ఎక్కువ మంది సమావేశంలో అభిప్రాయపడ్డారు.
ఏ ఏ నగరాల్లో...
ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహంతో పాటు సీట్ల సర్దుబాటుపై ఎక్కువగా నేతలు చర్చించినట్లు సమాచారం. ఏ ఏ రాష్ట్రాల్లో ఏఏ నగరాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి? ఆ సభల్లో ఎవరు పాల్గొనాలన్న దానిపై త్వరలోనే ఒక రూట్ మ్యాప్ ను రూపొందించాలని కూడా సమావేశంలో నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే దానికి ముందే జనంలోకి వెళ్లి బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరిస్తే మంచిదన్న అభిప్రాయం కూడా సమావేశంలో వ్యక్తమయినట్లు తెలిసింది.
సీట్ల సర్దుబాటుపై...
అలాగే పొత్తులతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లడం మంచిదన్న అభిప్రాయం కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీల నేతల నుంచి వచ్చినట్లు సమాచారం. మోదీని ఎదుర్కొనాలంటే ఐక్యంగా వెళితేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని పలువురు వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ప్రధానంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్ లో పొత్తుల విషయంలో ముందుగానే సర్దుబాటు చేసుకోవాలని నేతలు నిర్ణయించారు. బలాబలాల ప్రకారం సీట్ల సర్దుబాటు చేసుకుని ఎన్నికలకు వెళితే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమయింది.