సైనికులను వెంటాడుతున్న ఆత్మహత్యలు.. నివేదికలో షాకింగ్‌ నిజాలు

వాళ్లు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే భద్రతా బలగాలు. వాళ్లు కంటి మీద కునుకు వేయకుండా కాపలా కాస్తేనే, మనం కంటి నిండా..

Update: 2023-10-04 06:06 GMT

వాళ్లు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే భద్రతా బలగాలు. వాళ్లు కంటి మీద కునుకు వేయకుండా కాపలా కాస్తేనే, మనం కంటి నిండా నిద్రపోగలుగుతాం. వారు కనుక లేకపోతే మన ప్రాణాలకే ప్రమాదం. మనకు భద్రత కల్పించేవాళ్లకు ఇప్పుడు భద్రత కరువైందనే చెప్పాలి. CRPF, BSF లాంటి కేంద్ర భద్రతా బలగాల గురించి వెలువడుతున్న నివేదికలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. మావోయిస్టుల వేటలో అడవుల్లో నెలల తరబడి గడిపేవాళ్లకు, మత కలహాలు జరిగితే మేమున్నామంటూ ప్రజలకు రక్షణగా నిలిచేవాళ్లకు, ఇప్పుడు రక్షణ కరువైంది. పారా మిలటరీ ఫోర్సెస్‌కు చెందిన వందలమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వేలాదిమంది ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. ఐదేళ్ల డేటా ఈ పచ్చినిజాన్ని బట్టబయలు చేసింది.

సీఆర్‌ఫీఎఫ్‌, బీఎస్‌ఎప్‌, సీఐఎస్‌ఎఫ్‌ లాంటి కేంద్ర భద్రతా బలగాల్లో గత ఐదేళ్లలో 654మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 50వేల మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. 2018-2022 మధ్య కాలంలో CRPFలో 230 మంది, BSFలో 174మంది, CISFలో 89 మంది ఆత్మహత్య చేసుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. పారా మిలటరీ ఫోర్సెస్‌లో ప్రతి మూడు రోజులకు ఒక సైనికుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడని నివేదికలు చెబుతున్నాయి. మానసిక సమస్యలతోనే ఇవన్నీ జరుగుతున్నాయంటున్నారు సీనియర్‌ అధికారులు. అయితే ప్రమాదకర ప్రాంతాల్లో నెలల తరబడి డ్యూటీలు చేయడం, కుటుంబాలకు దూరంగా ఉండడం, అత్యంత కఠిన పరిస్థితుల్లో పనిచేయడం, తగినన్ని సెలవులు లేకపోవడం.. ఇవన్నీ భద్రతా దళాల్లో మానసిక ఒత్తిడికి దారితీసి ప్రాణాలు తీస్తోందని నిపుణులు చెబుతున్నారు.
భారత్‌లోని అతి పెద్ద పారా మిలటరీ ఫోర్స్‌ అయిన CRPF మెయిన్‌ డ్యూటీ దేశంలో అంతర్గత భద్రతను కాపాడడం. దీనిలో భాగంగా వాళ్లు మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పని చేస్తుంటారు. అక్కడ డ్యూటీ అంటే ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి విరుచుకు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంటుంది. ఎప్పుడు మావోయిస్టుల దాడికి గురవుతారన్నది కూడా తెలియని పరిస్థితి. మరోవైపు ఉగ్రవాదులు రెచ్చిపోయే కాశ్మీర్‌లో కూడా సీఆర్‌పీఎఫ్‌ బలగాలను పెద్దఎత్తున మోహరించారు. అక్కడ ఎప్పుడు తుపాకులు గర్జిస్తాయో ఎవరికీ తెలియదు. ఎప్పుడు చూసినా టెన్షన్‌ వాతావరణమే ఉంటుంది. టెన్షన్‌తో డ్యూటీ చేయడం వారికి పెద్ద సవాలుతో కూడుకున్నది. వాళ్లను మానసిక ఒత్తిడికి లోనయ్యేలా చేస్తోంది. వాళ్ల జీవితాలు ఎప్పుడు కూడా ప్రమాదపు అంచుల్లోనే వేలాడుతూనే ఉంటాయి. మృత్యువు ఎటువైపు దూసుకొస్తుందో తెలియదు. దీంతో పారామిలటరీ బలగాల్లో కొందరు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం, రాజీనామాల బాట పట్టడం జరుగుతోందంటున్నారు మానసిక నిపుణులు. భద్రతా బలగాలకు తగినంత విశ్రాంతి, సెలవులు ఇచ్చినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
2021 నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో గణాంకాల లాన్సెట్‌ విశ్లేషణ ప్రకారం.. పురుషులలో ఆత్మహత్యల రేటు 8.9 ఉంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) డేటా ప్రకారం, 2018, 2022 మధ్యకాలంలో 654 మంది CAPF సిబ్బంది ఆత్మహత్యతో మరణించారు. అంటే గత ఐదేళ్లలో సగటున ప్రతి మూడు రోజులకు ఒకసారి CAPF సభ్యుడు ఆత్మహత్య చేసుకున్నట్లు అంచనా వేయవచ్చు.
Tags:    

Similar News