యోగి కి సొంత పార్టీలోనే సెగ

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ పై రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుంది.

Update: 2022-07-21 03:39 GMT

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ పై రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఒక మంత్రి రాజీనామా చేయగా, మరొకరు ఢిల్లీ వెళ్లి పెద్దలను కలసి ఆయనపై ఫిర్యాదు చేయనున్నారు. ప్రధానంగా ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వినిపిస్తుండం కూడా విశేషం. గత ఐదేళ్లలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ ను పెద్దగా ఎవరూ వ్యతిరేకించలేదు. కొద్దిగా అసంతృప్తులు తలెత్తినా అవి సర్దుకుపోయేవిలాగానే కన్పించాయి. కానీ రెండోసారి మాత్రం అలా కాదు. ఆయన వైఖరిపై మంత్రులే ధ్వజమెత్తుతున్నారు.

కనీస మర్యాద...
అందులో ముఖ్యంగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దినేష్ కార్తీక్ తన రాజీనామా లేఖను నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పంపారు. తనకు గౌరవం లేదని, కనీసం తన కార్యదర్శి కూడా తనను పట్టించుకోవడం లేదని, ఇందుకు తన సామాజికవర్గమే కారణమని తాను భావిస్తున్నానని ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తనకు ఎలాంటి అధికారాలు లేవని ఆయన తెలిపారు. నమామీ గంగా పథకంలో కూడా అవినీతి చోటు చేసుకున్నట్లు ఆయన ఆరోపించారు.
అవినీతి ఆరోపణలపై...
అలాగే మరో మంత్రి జితిన్ ప్రసాద కూడా అసంతృప్తితో ఉన్నారు. ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసేందుకు వెళ్లారు. ప్రజా పనుల శాఖలో అవినీతి జరిగిందన్న కారణంతో జితిన్ ప్రసాద్ ఓఎస్డీని కూడా సస్పెండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ ను కలిసినా ఫలితం లేదు. ఇక ఆరోగ్యశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ సయితం అసంతృప్తితో ఉణ్నారు. ఇలా యోగి ఆదిత్యానాధ్ మంత్రి వర్గంలో ముగ్గురు మంత్రులు అసమ్మతి గళం విప్పడంతో కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.


Tags:    

Similar News