ఆర్జేడీ ట్వీట్ పై బీజేపీ ఫైర్ : దేశద్రోహం కేసు ?
పార్లమెంట్ ను శవపేటికతో పోలుస్తూ ఆర్జేడీ చేసిన ట్వీట్ పై బీజేపీ మండి పడింది. పార్లమెంట్ అంటే దేశానికే..
దేశ రాజధానిలో నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకను పలు పార్టీలు బహిష్కరించాయి. పార్లమెంట్ ను రాష్ట్రపతి ప్రారంభిస్తేనే వస్తామని తేల్చేశాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జేడీ(యు) ఆప్, ఎన్సీపీ, సీపీఐ(ఎం) శివసేన (యూబీటీ), ఆర్జేడీ, ఎస్పీ, సీపీఐ, ఐయూఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, జేఎంఎం, కేరళ కాంగ్రెస్ (మణి), మజ్లిస్, వీసీకే, రాష్ట్రీయ లోక్ దళ్, ఆర్ ఎస్ పీ, ఎండీఎంకే పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకలకు దూరంగా ఉన్నాయి.
కాగా.. లాలూ ప్రసాద్ యాదవ్ అధ్యక్షుడిగా ఉన్న ఆర్జేడీ తాజాగా నూతన పార్లమెంట్ డిజైన్ పై చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. పార్లమెంట్ ను శవపేటికతో పోలుస్తూ ఆర్జేడీ చేసిన ట్వీట్ పై బీజేపీ మండి పడింది. పార్లమెంట్ అంటే దేశానికే ఆలయం వంటిది. అలాంటి పార్లమెంట్ ను శవపేటికతో పోల్చడంపై బీజేపీ మండిపడింది. పార్లమెంటు భవనాన్ని శవపేటికతో పోల్చిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా సైతం ఆర్జేడీ ట్వీట్ పై స్పందించారు. 2024లో ప్రజలు మిమ్మల్ని అదే శవపేటికలో పాతిపెట్టడం ఖాయమన్నారు.
మరోవైపు ఆర్జేడీ ట్వీట్ పై ఒవైసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్జేడీకి ఒక స్టాండ్ అంటూ ఏమీ లేదని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ధ్వజమెత్తారు. కొత్త పార్లమెంట్ పై ఈ కోణం తీసుకురావడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆర్జేడీ శవపేటికతో పోల్చడం కాకుండా మరేదైనా మాట్లాడి ఉండాల్సిందన్నారు. నూతన పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చడం ఎంతమాత్రం సరికాదన్నారు. కాగా.. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధానికి బదులుగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తే బాగుండేదని అసదుద్దీన్ అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే ఎంఐఎం కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది.