అప్పుడు కుక్కలు.. ఇప్పుడు ఆంబోతు.. నాలుగేళ్ల చిన్నారిపై దారుణం

అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డు కావడంతో వెలుగులోకొచ్చింది. సీసీటీవీ పుటేజీ ప్రకారం..

Update: 2023-03-09 12:41 GMT

bull attack on child

ఇటీవల కాలంలో రోడ్లపై వెళ్తున్న చిన్నారులపై కుక్కలు దాడులు చేస్తుండటంతో.. తల్లిదండ్రులు ఒంటరిగా బయటకు పంపాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఓ చిన్నారిని వీధి కుక్కలు అతిదారుణంగా కరిచి చంపిన ఘటన తీవ్రకలకలం రేపింది. కుక్కలే కాదు.. ఇతర జంతువులూ చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. రోడ్డుపై నిలబడి ఉన్న ఓ చిన్నారిని ఆంబోతు అతి దారుణంగా కుమ్మేసింది. అంతటితో ఊరుకోక.. తీవ్రగాయాలతో పడి ఉన్న ఆ చిన్నారిపైనే కూర్చుండిపోయింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ పట్టణంలోని తానా గాంధీ పార్క్ సమీపంలో ఉన్న ధనిపూర్ మండిలో ఈ దారుణ ఘటన జరిగింది. అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డు కావడంతో వెలుగులోకొచ్చింది. సీసీటీవీ పుటేజీ ప్రకారం.. నాలుగేళ్ల వయసున్న ఒక చిన్నారి రోడ్డు మీద నిలబడి ఉంది. ఇంతలో గల్లీ వెంట వచ్చిన ఒక ఆంబోతు.. మరో ఆంబోతుతో పొట్లాటకు వెళ్లినట్టుగా కాలు దువ్వి, మెడలు విరుస్తూ.. చిన్నారిని ఒక్క ఉదుటన కుమ్మేసింది. ఆ ఆంబోతు ధాటికి చిన్నారి ఎగిరి పడి, స్పృహ కోల్పోయింది. అనంతరం ఆ ఆంబోతు చిన్నారి పైనే కూర్చుంది.
ఆ పక్కనే ఉన్న ఇంట్లో నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆంబోతు కింద రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని బయటకు తీశారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. మున్సిపల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆంబోతును బంధించి తీసుకెళ్లారు.




Tags:    

Similar News