Corona Virus : నైట్ కర్ఫ్యూ తప్పేట్లు లేదు... కేంద్ర ప్రభుత్వం హైలెవెల్ మీటింగ్
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా ఆలోచన చేస్తుంది. నైట్ కర్ఫ్యూ పెట్టాలని యోచిస్తుంది.
దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా ఆలోచన చేస్తుంది. రోజుకు దేశ వ్యాప్తంగా ఏడు వందలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. రానున్నది పండగల సీజన్ కావడంతో మరింతగా కేసుల సంఖ్య ఎక్కువయ్యే అవకాశముందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతుందనడానికి ఇప్పటికే దేశ వ్యాప్తంగా నాలుగు వేల కేసులకు పైగానే నమోదు కావడం ఒకింత ఆందోళనకు గురి చేస్తుంది.
వరస పండగల నేపథ్యంలో....
రానున్నది న్యూ ఇయర్ వేడుకలతో పాటు సంక్రాంతి వంటి పెద్ద పండగలు కూడా వస్తుండటంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్న హెచ్చరికలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించాయి. సీనియర్ సిటిజన్లు విధిగా మాస్క్‌లను ధరించాలంటూ కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కేసుల సంఖ్య...
దీంతో నైట్ కర్ఫ్యూ పెడితే ఎలా ఉంటుందన్న దానిపై కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రధానంగా జేఎన్ 1 వేరియంట్ కేసులు పెరుగుతుండటం కూడా దీనికి కారణం. ఉత్తర్‌ప్రదేశ్, కేరళలో ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఏడుగురు మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ పెట్టాలన్న యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని, ప్రధానంగా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారికి టెస్ట్ లు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంపై కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం త్వరలో నిర్వహించనుంది.