క్షమించమని కోరిన ఉద్ధవ్ థాకరే
గురువారం మహారాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని సీఎం ఉద్ధవ్ ను ఆ రాష్ట్ర గవర్నర్ ఆదేశించారు.
మహారాష్ట్రలో ఓ రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే..! ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఉద్ధవ్ థాకరే బుధవారం ఉద్వేగానికి గురయ్యారు. ముంబైలోని సెక్రటేరియట్‌లో జరిగిన కేబినెట్ భేటీ సందర్భంగా.. తన వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించాలని ఆయన తన కేబినెట్ మంత్రులతో అన్నారు. తనకు ఇన్ని రోజులుగా మద్దతుగా నిలబడినందుకు ఆయన మంత్రులకు కృతజ్ఞతలు చెప్పారు. రెండున్నరేళ్లుగా అందరూ తనకు సహకరించారని.. తన వాళ్లే తనను మోసం చేశారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కేబినెట్ భేటీని ముగించుకుని సచివాలయం బయటకు వచ్చిన ఉద్ధవ్ థాకరే మీడియా ప్రతినిధులకు నమస్కారం చేసి వెళ్లిపోయారు.
ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో భేటీ అయిన ఆ రాష్ట్ర కేబినెట్ 2 నగరాల పేర్లతో పాటు ఓ ఎయిర్ పోర్టు పేరును కూడా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్‌గా మార్చారు. ఉస్మానాబాద్ పేరును ధారాశివ్‌గా మార్చింది. ముంబైలోని నవీ ముంబై ఎయిర్ పోర్టు పేరును డీబీ పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా మార్చింది. ఈ మూడు ప్రతిపాదనలకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
గురువారం మహారాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని సీఎం ఉద్ధవ్ ను ఆ రాష్ట్ర గవర్నర్ ఆదేశించారు. ఈ క్రమంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా నేరుగా ముంబైకి వెళ్లకుండా సమీపంలోని గోవాకు చేరుకుంటూ ఉన్నారు. గురువారం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయానికి తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముంబైకి చేరుకునే అవకాశముంది.