Corona Virus : తరుముకొస్తున్న మహమ్మారి.. మరోసారి లాక్ డౌన్ తప్పదా?
దేశంలో మరోసారి కరోనా వైరస్ భయపెడుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది
దేశంలో మరోసారి కరోనా వైరస్ భయపెడుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. దాదాపు రెండేళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న దేశంలో మరోసారి కల్లోలం రేగుతుంది. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతానికి రోజుకు ఆరు వందల నుంచి ఏడు వందలకు పైగా కేసులు నమోదవుతున్నా త్వరలోనే రోజుకు వేల సంఖ్య దాటే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ఈ రాష్ట్రాలలోనే...
కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. లాక్ డౌన్ దిశగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. గతంలో కరోనా వైరస్ వల్ల లక్షల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఎవరూ మృతుల వద్దకు కూడా చేరుకోలేకపోయారు. ఆక్సిజన్ సిలిండర్ల కొరత కూడా ఇబ్బంది పెట్టింది. మందుల కొరతతో కూడా ప్రజలు ఇబ్బంది పడ్డారు. అయితే ఈసారి మాత్రం చికిత్స నిమిత్తం ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి.
మాస్క్ కంపల్సరీ...
ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మాస్క్‌ను కంపల్సరీ చేశాయి. భౌతిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రధానంగా జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతి నొప్పి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, కరోనా టెస్ట్ చేయించుకుని తగిన చికిత్సను తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలను అలర్ట్ చేస్తుంది. మూడు డోసుల వ్యాక్సిన్ పూర్తి కావడంతో కేసుల సంఖ్య కొంత తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నా.. వరస పండగలతో మహమ్మారి విజృంభించే అవకాశాలున్నాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
జనవరి నెలాఖరు వరకూ...
పైగా వైరస్ మంచు దెబ్బకు మరింత ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. జనవరి నెలాఖరు వరకూ కేసుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధుల కోసం చికిత్స పొందుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీరు గుంపులుగా వెళ్లకపోవడమే మంచిదని సూచనలు అందుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లినా మాస్క్‌లు విధిగా ధరించాలని కోరుతున్నారు. దేశంలో ఇప్పటి వరకూ 4.5 కోట్లు వైరస్ బారిన పడగా, 5,33,333 మంది మరణించారు. మరణాల సంఖ్య తగ్గించాలని, వైరస్ బాధితులకు వెంటనే చికిత్స అందేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.