దూసుకొస్తున్న అసని.. తీరప్రాంతాలకు భారీ వర్షసూచన
అండమాన్ అండ్ నికోబార్ తర్వాత తుపాను ఉత్తర దిశగా పయనించి.. మార్చి 22కి ఉత్తర మయన్మార్, ఆగ్నేయ బంగ్లాదేశ్ తీరాలకు..
న్యూ ఢిల్లీ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ప్రస్తుతం తీవ్రపీడనంగా మారిందని, సోమవారం సాయంత్రానికి అది తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫానుకు అసనిగా నామకరణం చేసినట్లు వెల్లడించింది. తుఫాను ప్రభావంతో అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో సోమవారం భారీ వర్షంతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అండమాన్ అండ్ నికోబార్ తర్వాత తుపాను ఉత్తర దిశగా పయనించి.. మార్చి 22కి ఉత్తర మయన్మార్, ఆగ్నేయ బంగ్లాదేశ్ తీరాలకు చేరుకుంటుందని అంచనా వేశారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో పోర్ట్ బ్లెయిర్ తో పాటు చుట్టుపక్కల దీవుల మధ్య నడిచే అన్ని నౌకలను నిలిపివేశారు. తుఫానులో ఎవరైనా ప్రయాణికులు చిక్కుకుంటే.. సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 03192 245555/232714 మరియు టోల్ ఫ్రీ నంబర్ 1 800 345 2714 జారీ చేశారు. 150 మంది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) సిబ్బందిని మోహరించారు.