తొలిరోజూ క్యూ కట్టిన జనం
సెప్టంబరు 30వ తేదీ వరకూ గడువు ఉన్నప్పటికీ రెండు వేల నోట్లను మార్చుకోవడం కోసం ప్రజలు క్యూ కట్టారు
జనం వేలం వెర్రి అంటే ఇంతే. సెప్టంబరు 30వ తేదీ వరకూ గడువు ఉన్నప్పటికీ రెండు వేల నోట్లను మార్చుకోవడం కోసం ప్రజలు క్యూ కట్టారు. బ్యాంకుల వద్ద బారులు తీరారు. రెండు వేల రూపాయల నోట్లను ఏటీఎం వద్ద జమ చేసేందుకు పెద్దయెత్తున క్యూ కట్టారు. తమ వద్ద ఉన్న పదో పరకో డబ్బులు మార్చుకునేందుకు సమయం ఉన్నప్పటికీ, రిజర్వ్ బ్యాంకు చేసిన ప్రకటనతో ఒక్కసారిగా జనం ఏటీఎంలపై పడ్డారు.
బ్యాంకుల వద్ద...
ఇక బ్యాంకుల వద్ద రెండు వేల నోట్ల మార్పిడికి కూడా ఖాతాదారులు పెద్ద సంఖ్యలో చేరారు. రోజుకు పదికి మించి రెండు వేల రూపాయలు నోట్లు మార్చుకోవడానికి వీలులేదన్న నిబంధనతో ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. బ్యాంకు సిబ్బంది రెండు వేల నోట్ల మార్పిడికి అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయకపోవడంతో పెద్ద పెద్ద క్యూ లైన్‌లు దర్శనమిస్తున్నాయి. ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ జనం వేలం వెర్రిగా క్యూ కట్టడమేంటని బ్యాంకు సిబ్బంది చికాకు పడుతున్నారు.