పీఎఫ్ ఖాతాదారులకు షాక్.. 40 ఏళ్ల కనిష్టానికి వడ్డీరేట్ల తగ్గింపు

2021–22కిగానూ పీఎఫ్ వడ్డీరేట్ల శాతాన్ని 8.5 నుంచి 8.1కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రభావం సుమారు..

Update: 2022-03-12 10:54 GMT

న్యూ ఢిల్లీ : పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగ భవిష్య నిధి (Employees' Provident Fund Organisation) వడ్డీరేట్లను 40 ఏళ్ల కనిష్టానికి తగ్గించి, చందాదారులకు ఊహించని షాకిచ్చింది ఈపీఎఫ్ఓ సంస్థ. 2021–22కిగానూ పీఎఫ్ వడ్డీరేట్ల శాతాన్ని 8.5 నుంచి 8.1కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రభావం సుమారు 6 కోట్లమంది పీఎఫ్ చందాదారులపై పడనుంది. ప్రస్తుతం సంస్థ ఆదాయం రూ.76,768 కోట్లుగా ఉందని, దానిని దృష్టిలో పెట్టుకునే వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చిందని ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ మెంబర్ మైకేల్ డయాస్ తెలిపారు.

2021-2022 సంవత్సరానికి కార్పస్ ఫండ్ ఆదాయం 13 శాతం పెరిగినా.. ఆదాయంపై వడ్డీ మాత్రం 8 శాతమే ఉందని ఈపీఎఫ్ఓ సభ్యుడు కేఈ రఘునందన్ వెల్లడించారు. 8.1 శాతం వడ్డీ చెల్లించాక ఈపీఎఫ్ వద్ద మిగులు రూ.450 కోట్లు ఉంటుందని తెలిపారు. కాగా.. 1977–78 తర్వాత ఇంత తక్కువగా వడ్డీని చెల్లించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆ ఏడాది పీఎఫ్ పై 8 శాతం వడ్డీని చెల్లించారు. 2018–19, 2016–17లలో 8.65 శాతం చొప్పున వడ్డీని జమ చేశారు. 2013–14, 2014–15లో 8.75 శాతం, 2015–16లో 8.8 శాతం చొప్పున చెల్లించారు. కరోనా సమయంలో నగదు ఉప సంహరణలు పెరిగి, చందాదారుల నుంచి జమ అయ్యే సొమ్ము తగ్గడంతో 2019–2020కిగానూ 8.5 శాతానికి తగ్గించారు.



Tags:    

Similar News