థర్డ్ వేవ్ ఖచ్చితంగా వస్తుంది.. కానీ ?
కరోనా థర్డ్ వేవ్ కు ఒమిక్రాన్ వేరియంట్ ప్రధాన కారణమవుతుందని ఇప్పటికే నిపుణులు అంచనా వేశారు
కరోనా థర్డ్ వేవ్ కు ఒమిక్రాన్ వేరియంట్ ప్రధాన కారణమవుతుందని ఇప్పటికే నిపుణులు అంచనా వేశారు. ఫిబ్రవరి కల్లా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పీక్ స్టేజ్ లో నమోదవుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ విషయాన్నే ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ అగర్వాల్ అధ్యయనంలో తెలుసుకున్నారు. ఆయన చేసిన అధ్యయనంలో తెలుసుకున్న విషయాల గురించి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 'సూత్ర' అనే విధానం ఆధారంగా ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేసినట్లు చెప్పారు. థర్డ్ వేవ్ ఖచ్చితంగా వస్తుంది.. కానీ ఈ వేవ్ లో వచ్చే ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలని తెలిపారు. అలాగే ఈ వేరియంట్ శరీరంలో ఉండే రోగనిరోధకశక్తిపై ప్రభావం చూపదన్నారు.
త్వరగా వ్యాప్తి చెందినా....
డెల్టా వేరియంట్ కన్నా ఇది త్వరగా వ్యాప్తి చెందినా.. ఇది సోకిన వారికి క్లిష్టమైన సమస్యలు రాబోవన్నారు. ఒమిక్రాన్ సోకినవారిలో కరోనా స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తాయని, ఈ తరహా కేసులు గరిష్ట స్థాయికి చేరినా దాని ప్రభావం తక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు. ప్రభావం తక్కువగానే ఉంటుంది కదా అని అలసత్వం వహించరాదని సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకునే చర్యలపైనే దీని ప్రభావం ఆధారపడి ఉంటుందని చెప్పారు. జనాలు గుంపులుగా చేరకుండా నిషేధం విధించడం, రాత్రి పూట కర్ఫ్యూలు అమలు చేయడం వంటి చర్యలు తీసుకోవడం వల్ల ఒమిక్రాన్ వ్యాప్తిని కాస్తైనా నిషేధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.