18 ఏళ్లకు ఓటు వేయొచ్చు..కానీ పెళ్లి చేసుకోకూడదా ?

వివాహం ఆలస్యమైతే రెండు ప్రధాన సమస్యలు వెంటాడుతాయన్నారు. వాటిలో ఒకటి.. సంతానోత్పత్తి భయం. రెండవది తల్లిదండ్రులు

Update: 2021-12-18 10:08 GMT

భారతదేశంలో అమ్మాయిల పెళ్లి వయసును పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. గతంలో ఆడపిల్లల వివాహ వయస్సు 18 ఏళ్లు ఉండేది.. ఇప్పుడు దానిని 18 నుంచి 21కి పెంచింది కేంద్రం. ఇందుకు సంబంధించిన బిల్లును కూడా ప్రభుత్వం సిద్ధం చేసి.. పార్లమెంట్ ఆమోదముద్ర వేయించేందుకు రెడీగా ఉంచింది. కానీ ఆడపిల్లల భవిష్యత్ గురించి ఆలోచించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్ని సమాజ్ వాదీ పార్టీ నేత సయ్యద్ తుఫైల్ హసన్ తీవ్రంగా వ్యతిరేకించారు. అమ్మాయిల వివాహ కనీస వయసును కేంద్రం పెంచడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విషయంపై ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆడపిల్లలకు పునరుత్పత్తి వయసు రాగానే పెళ్లి చేయాలని అన్నారు. నిజానికి యువతుల పునరుత్పత్రి వయస్సు 16-17 నుంచి 30 సంవత్సరాల వరకూ ఉంటుంది. అందుకే 16 ఏళ్ల నుంచి ఇళ్లల్లో ఆడపిల్లల పెళ్లి ప్రస్తావన వస్తుంటుంది.

సరైన వయస్సులో పెళ్లి అవ్వకపోతే.. 

సరైనవయస్సు పెళ్లి జరిగితే అంతా బాగానే ఉంటుంది. కానీ వివాహం ఆలస్యమైతే రెండు ప్రధాన సమస్యలు వెంటాడుతాయన్నారు. వాటిలో ఒకటి.. సంతానోత్పత్తి భయం. రెండవది తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చేంతవరకూ స్థిరపడకపోవడం. పెళ్లి ఆలస్యంగా చేసుకుంటే..వారి త‌ల్లిదండ్రులు వృద్దాప్యానికి వ‌చ్చేవ‌ర‌కు పిల్లలు ఇంకా చదువుతునే ఉంటారు. ఇలా చేస్తే..సహజ చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నట్లేనని సయ్యద్ తుఫైల్ హసన్ అభిప్రాయపడ్డారు. 18 సంవత్సరాలకే ఓటు వేస్తున్నపుడు.. అదే వయసులో పెళ్లి ఎందుకు చేసుకోకూడదని ఆయన ప్రశ్నించారు.

బిల్లును అడ్డుకుంటాం..

సయ్యద్ తో పాటు సమాజ్ వాది పార్టీ మరో సీనియర్ నేత కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. పేద దేశమైన భారత్ లో ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు తమ బిడ్డలకు త్వరగా వివాహం చేయాలని అనుకుంటారని, ఇప్పుడు కేంద్రం చేసిన ప్రతిపాదనతో మున్ముందు ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారంగా మారతాయని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ లో ఈ బిల్లును ప్రవేశపెడితే ఖచ్చితంగా తాము దానిని వ్యతిరేకిస్తామని, ఎట్టిపరిస్థితుల్లో మద్దతివ్వబోమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. సమాజ్ వాదీ పార్టీ అధినేత అయిన అఖిలేష్ యాదవ్ మాత్రం ఈ వ్యాఖ్యలకు దూరంగా ఉన్నారు. తమ పార్టీది అభ్యుదయవాదమని, మహిళలు, బాలికల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రారంభించామని అఖిలేష్ అన్నారు. ఇటువంటి ప్రకటనలతో సమాజ్‌వాదీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.


Tags:    

Similar News