ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ లపై కేంద్రం ఉక్కుపాదం.. కేవైసీ తప్పనిసరి
ప్రస్తుతం భారత్ లో నిర్వహిస్తున్న ఆయా ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్, జూదాన్ని ప్రోత్సహిస్తున్నాయా ? లేదా? అనేది తేల్చిన..
టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ ల వినియోగం పెరగడంతో.. ఆన్ లైన్ గేమ్ లు కూడా కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నాయి. కష్టపడకుండా ఫోన్ లో ఆన్లైన్ గేమ్ ఆడితే చాలు.. గెలిస్తే డబ్బులు మీ సొంతం అంటూ యూజర్లను ఆకట్టుకుంటుండటంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది ఆన్లైన్ గేమింగ్ కు అలవాటు పడ్డారు. ఇందులో సంపాదించేది కొందరే అయితే.. నమ్మి డబ్బు పెట్టి నష్టపోయేవారెందరో ఉన్నారు. వీటి మోజులో పడే చాలా మంది ఆన్లైన్ లోన్ లు తీసుకుని వాటిని కట్టలేక, కట్టినా ఇంకా కట్టాలన్న వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.
తాజాగా.. భారత్ లో ఆన్ లైన్ గేమింగ్ కోసం కేంద్రం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిబంధనలు ప్రకటించింది. బెట్టింగ్, జూదం నిర్వహించే ఆన్ లైన్ గేమ్స్ ను నిషేధిస్తామని ఆ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ విషయం నిర్థారించేందుకు కేంద్రం కొన్ని సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్స్ (ఎస్ఆర్ఓ) నియమిస్తుందన్నారు. ఇందులో వ్యాపార ప్రతినిధులు, విద్యావేత్తలు, సైకాలజీ నిపుణులు సహా ఇతర నిపుణులు ఉంటారని కేంద్రం వెల్లడించింది.
ప్రస్తుతం భారత్ లో నిర్వహిస్తున్న ఆయా ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్, జూదాన్ని ప్రోత్సహిస్తున్నాయా ? లేదా? అనేది తేల్చిన తర్వాత.. వాటికి అనుమతించేందుకు ఎస్ఆర్ఓలు బాధ్యత వహిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. బెట్టింగ్ కు అవకాశం లేదని ఎస్ఆర్ఓ భావిస్తే అలాంటి రియల్ మనీ గేమ్ కు అనుమతి ఇవ్వొచ్చని నిబంధనల్లో పేర్కొన్నారు. ఆన్లైన్ గేమర్లు కూడా కేవైసీ వెరిఫికేషన్ తప్పనిసరి అని ఐటీ శాఖ స్పష్టం చేసింది. తాజాగా తీసుకొచ్చిన ఈ నిబంధనలను పాటించని ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై తగు చర్యలు ఉంటాయని కేంద్రం తేల్చి చెప్పింది.