అకౌంట్లో రూ.9 కోట్లు.. వెంటనే మాయం
బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో చెన్నైలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ ఖాతాలో తొమ్మిది కోట్లు క్రెడిట్ అయ్యాయి.
బ్యాంకుల్లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. తమకు తెలియకుండానే డబ్బులు వచ్చి పడుతుంటాయి. తమ ఖాతాలో డబ్బులు పడ్డాయని సంతోషించేలోగా వెంటనే అవి మాయమయిపోతాయి. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో చెన్నైలో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఒక ఆటో డ్రైవర్ ఖాతాలో దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు క్రెడిట్ అయ్యాయి. పళని నెయ్‌క్కారపట్టికి చెందిన రాజ్‌కుమార్ ఖాతాలో ఈ డబ్బులు పడ్డాయి. చెన్నై లోని కొడంబాక్కం లో ఉంటున్న రాజ్‌కుమార్ ఒక కారు డ్రైవర్. కారు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
అధికారుల పొరపాటు...
అయితే తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు నుంచి తొమ్మిది కోట్లు తన ఖాతాలో పడినట్లు రాజ్‌కుమార్ సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. తొలుత ఆశ్చర్యం పడినా, అది నిజమా? కాదా? తెలుసుకునేందుకు తన ఖాతాలో స్నేహితుడి చేత ఇరవై ఒక్కవేల రూపాయలు జమ చేయించాడు. నిజమే.. 9 కోట్లు తన ఖాతాలో ఉన్నట్లు గుర్తించిన రాజ్‌కుమార్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే తాము చేసిన పొరపాటున గ్రహించిన తూత్తుకూడిలోని బ్యాంకు కార్యాలయం అధికారులు వెంటనే ఆ సొమ్మును వెనక్కు తీసుకున్నారు. దీంతో రాజ్‌కుమార్ ఆనందంపై నీళ్లు కుమ్మరించినట్లయింది.