బిడ్డ 'రోవర్' ఆడుతుంటే మురిసిపోతూ వీడియో తీసిన 'విక్రమ్ ల్యాండర్'
చంద్రునిపై ల్యాండైన్ చంద్రయాన్-3 రోవర్ పరిశోధన వేగవంతంగా కొనసాగిస్తోంది. చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై చురుకుగా..
చంద్రునిపై ల్యాండైన్ చంద్రయాన్-3 రోవర్ పరిశోధన వేగవంతంగా కొనసాగిస్తోంది. చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై చురుకుగా పరిశోధన చేస్తూ కీలక విషయాలను ఇస్రోకు పంపుతోంది. ఇప్పటి వరకు వారం రోజులు పూర్తి చేసుకున్న రోవర్ కీలక ఫోటోలను తీస్తూ పంపిస్తోంది. గత రెండు రోజుల కిందట ప్రజ్ఞాన్ రోవర్ విక్రమ్ ల్యాండర్ చిత్రాన్ని తీయగా, ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ తన కెమెరాలో ప్రజ్ఞాన్‌ను బంధించింది. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉపరితలంపై తిరుగుతోంది. ఆ సమయంలో విక్రమ్ ల్యాండర్ దాని వీడియోను చిత్రీకరించింది. తల్లి నీడలో పిల్ల ఆటలాడుకుంటున్నట్లుగా కనిపిస్తోంది ఈ వీడియో చూస్తుంటే. సురక్షితమైన మార్గాన్ని వెతుక్కుంటూ చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతోందని ఇస్రో గురువారం ట్వీట్ చేసింది. ఈ భ్రమణం ల్యాండర్ కెమెరాలో బంధిస్తూ ఇస్రోకు పంపింది విక్రమ్ ల్యాండర్.
చంద్రుని దక్షిణ ధృవంలో.. ఆక్సిజన్, ఇతర మూలకాల ఉనికితోబాటు..ఉష్ణోగ్రతల్లో మార్పులను చంద్రయాన్-3 ఇప్పటికే గుర్తించింది. ఇప్పుడు దానికి ఒక వారం సమయం మాత్రమే ఉంది. ప్రజ్ఞాన్ రోవర్ క్లిక్ చేసిన విక్రమ్ ల్యాండర్ చిత్రాలను ఇస్రో ట్వీట్ చేసింది. అందులో చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ కపిపించడం చూడవచ్చు.
ఇప్పటికే చంద్రునిపై విలువైన ఖనిజాలు ఉన్నట్లు రోవర్ గుర్తించి సమాచారం మొత్తం ఇస్రోకు చేరవేసింది. చంద్రుని నేలలో సల్ఫర్‌తో పాటు ఆక్సిజన్‌తో సహా మొత్తం 8 మూలకాలు గుర్తించారు. ఇది ఇస్రోకి పెద్ద విజయమనే చెప్పాలి. ఇప్పుడు హైడ్రోజన్‌ను గుర్తించే పరిశోధన కొనసాగుతోంది. అయితే చంద్రునిపై హైడ్రోజన్ ఉన్నట్లయితే నీటిని తయారు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. చంద్రుని ఉష్ణోగ్రత కూడా మైనస్‌కు వెళుతుంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్, ప్రజ్ఞాన్‌లు చేసిన ఈ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.
అయితే రోవర్ సేఫ్ రూట్ కోసం వెతుకుతున్న వీడియోను షూట్ చేసింది విక్రమ్ ల్యాండర్. తన బిడ్డ ఆడుతుంటే తల్లి ప్రేమగా చూస్తున్న సందేశం అంటూ ఇస్రో ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రోవర్ చక్కర్లు కొడుతున్న వీడియోను ఇస్రో షేర్ చేసింది. సేఫ్ రూట్ కోసం వెతుకుతోంది అంటూ ట్వీట్ చేసింది.