Corona Virus : అమ్మో మళ్లీ కరోనా... దూసుకు వస్తుంది... జాగ్రత్తగా లేకుంటే?
దేశంలో మళ్లీ కరోనా కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కేరళలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి
కరోనా మనల్ని వీడి వెళ్లిపోయిందని ఆనందపడినంత సమయం లేదు. మళ్లీ దేశంలో కరోనా కేసులు మొదలయ్యాయి. అధిక సంఖ్యలోనే నమోదవుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ను ప్రకటించే అవకాశముంది. గత రెండేళ్లుగా కరోనా లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా మళ్లీ పుంజుకునే సమయంలో మళ్లీ చేదువార్త వినిపిస్తుంది.
రెండేళ్లు వరసగా...
తాజాగా దేశంలో కరోనా కేసులు నమోదు అవుతుండటం కలకలం రేపుతుంది. దేశంలో ఒక్కరోజులోనే 162 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కేరళలోనే ఈ కేసులు నమోదయ్యాయి. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా దేశాన్ని కుదిపేసింది. రెండేళ్లు ప్రజలు మాస్క్‌లు ధరించి మాత్రమే బయటకు వచ్చేవారు. లాక్ డౌన్ విధించారు. ఎందరో కరోనాకు బలయిపోయారు. అయితే గత రెండేళ్లుగా కరోనా తగ్గుముఖం పట్టిందనుకున్న తరుణంలో మళ్లీ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ వేరియంట్లతో జనాలను ఇబ్బంది పెట్టాయి.
మళ్లీ దేశంలోకి...
ఒకరా.. ఇద్దరా.. లక్షల సంఖ్యలో కరోనా బారిన పడి మరణించారు. కరోనా సోకిన వారు బతికి కూడా అనేక వ్యాధులకు లోనయి ఇప్పటికీ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి కరోనా సమసి పోయిందనుకున్న సమయంలో మరో దుర్వార్త వినిపించింది. దేశంలో మళ్లీ కరోనా కేసులు నమోదు కానుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్రాలను అలర్ట్ చేశారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.