Jayalalitha : "అమ్మ" బంగారం మొత్తం తమిళనాడుకే.. ఆరు ట్రంక్ పెట్టెలు తీసుకు రావాలంటూ
మాజీ ముఖ్యమంత్రి జయలలిత బంగారు ఆభరణాలన్నీ తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కర్నాటక న్యాయస్థానం ఆదేశించింది
మాజీ ముఖ్యమంత్రి జయలలిత బంగారు ఆభరణాలన్నీ తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కర్నాటక న్యాయస్థానం ఆదేశించింది. వచ్చే నెల 6,7 తేదీల్లో ఈ బంగారాన్ని తమిళనాడు ప్రభుత్వం తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం ఆరు ట్రంకు పెట్టలతో రావాలంటూ కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి తెలిపింది. ఈ రెండు రోజుల్లో జయలలిత బంగారు ఆభరణాల అప్పగింత కేసు తప్పించి మరో కేసును విచారించకూడదని న్యాయస్థానం నిర్ణయించింది.
కర్ణాటక ప్రభుత్వ అధీనంలో...
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బంగారం కర్ణాటక ప్రభుత్వం అధీనంలో ఉంది. 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి బంగారం, వెండి, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్న వస్తువులన్నీ కర్ణాటక ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. దాదాపు ఏడు కిలోల బంగారు ఆభరణాలు, ఏడు వందల కిలోల వెండి వస్తువులు, 468 రకాల వజ్రాభరణాలు ఇందులో ఉన్నాయి. కర్ణాటక ప్రభుత్వ అధీనంలో జయలలితకు సంబంధించిన ఖరీదైన చెప్పులు, ఇతర వస్తువులు, 1.93 లక్షల నగదు కూడా ఉంది. అయితే వీటన్నింటినీ తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని కర్ణాటకలోని బెంగళూరు కోర్టు ఆదేశించింది.
పూర్తి భద్రత మధ్య రావాలంటూ...
ఆరు ట్రంకు పెట్టెలతో పాటు పూర్తి భద్రత మధ్య రావాలని కోర్టు తన ఉత్తర్వులలో పేర్కొంది. అక్రమాస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న ఈ వస్తువులను జయలలిత మరణించడంతో తమిళనాడు ప్రభుత్వానికి ఇవ్వాలని తెలిపింది. అధికారులతో పాటు వచ్చి వారితో సమన్వయం చేసుకుని బంగారు వస్తువులను స్వాధీనం చేసుకునేటప్పుడు ఫొటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్ ను కూడా తెచ్చుకోవాలని కోరింది. దీంతో తమిళనాడు ప్రభుత్వానికి జయలలిత బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయింది.