Tiger: ఆ పులిని చంపేయండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఈ మధ్య కాలంలో పులుల సంచారం పెరిగిపోయింది. అటవీ ప్రాంతం నుంచి గ్రామాల పొలిమేరల్లో వస్తుండటం...
ఈ మధ్య కాలంలో పులుల సంచారం పెరిగిపోయింది. అటవీ ప్రాంతం నుంచి గ్రామాల పొలిమేరల్లో వస్తుండటం, పశువులను చంపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అలా సంచరించే పులులను అటవీశాఖ అధికారులు బంధించేందుకు ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే కేరళలోని వయనాడ్ జిల్లాలో అలజడి సృష్టించిన పులిని చంపేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వయనాడ్‌లోని కలపేటలో నివాసముంటున్న 36 ఏళ్ల ప్రజీశ్ అనే వ్యక్తి గడ్డి కోయడానికి వెళ్లగా పులి దాడి చేసి చంపేసింది. శరీరంలో కొంత భాగాన్ని సైతం పులి తీనేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనాస్థలం నుంచి మృతదేహాన్ని తరలించొద్దంటూ ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు దిగారు.
దీంతో ప్రజీశ్ మృతికి కారణమైన ఆ పులిని చంపేయాలంటూ ప్రభుత్వం అటవీ శాఖ అధికారులను ఆదేశించింది. ఆ పులి మనుషులను చంపి తినే రకమా? కాదా? అనేది ధ్రువీకరించుకోవాలని కూడా స్పష్టం చేసింది ప్రభుత్వం. అయితే చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ షెడ్యూల్ వన్ కింద ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మనిషి ప్రాణాలకు ప్రమాదకరమైతే జంతువును చంపవచ్చనే నిబంధన ఇందులో ఉంది. దేశంలో పులి ఒక రక్షిత జంతువు. అలాగే ఇక్కడి పులులను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ పర్యవేక్షిస్తోంది.