గాంధీజీ నివసించిన కుటీరం.. ఎన్నో ఆసక్తికర విషయాలు

భారత దేశం గర్వించదగిన మహనీయులలో మహాత్మా గాంధీ ఒకరు అని చెప్పేకంటే.. అందరికంటే ముందుంటారు అని చెప్పొచ్చు..

Update: 2023-10-02 04:37 GMT

భారత దేశం గర్వించదగిన మహనీయులలో మహాత్మా గాంధీ ఒకరు అని చెప్పేకంటే.. అందరికంటే ముందుంటారు అని చెప్పొచ్చు. భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్య్రం అందించడం కోసం చేసిన పోరాటానికి గాంధీజీ ఎంచుకున్న శాంతి, అహింస మార్గం భారతీయులకే కాదు.. యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. అందుకే ఆయన మహాత్ముడు అయ్యారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఆ మహాత్ముడిని మరోసారి స్మరించుకుంటూ.. గాంధీజీ నివసించిన ప్రదేశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

కొద్ది క్షణాల శాంతి అనుభవం కావాలంటే సేవాగ్రాం అనే చిన్న ప్రశాంత పట్టణాన్ని సందర్శిస్తే సరిపోతుంది. పచ్చని చెట్లతో నిండిన వనాల మధ్య ఆధ్యాత్మికతకు, ధ్యాన కేంద్రానికి చక్కటి ఎంపిక ఈ చిన్న పట్టణం. ఈ సేవాగ్రాం మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో ఉంది. నాగ్ పూర్ నుంచి 77 కిలోమీటర్ల దూరంలో వార్ధా నుంచి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.. సేవాగ్రాం అంటే ‘సేవకోసం ఉన్న ఊరు’ అని అర్థం. గాంధీ 1934లో ఈ ఊరికి వచ్చినప్పుడు ఆ పేరు పెట్టారు. అంతకు పూర్వం దీనిని 'షేగావ్' అని పిలిచేవారు. గాంధీజీ ఉద్యమం సమయంలో స్వాతంత్ర్య పోరాటం ఇక్కడి నుంచే కొనసాగించారు.

బాపు కుటీరం:

సేవాగ్రాం ఆశ్రమం గాంధీజీ జీవన విధానానికి దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. తన భార్య కస్తూర్బా గాంధీతో కలిసి ఆయన నివసించిన కుటీరం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ కుటీరాల్లో ఎలాంటి అలంకరణలూ లేవు. చూడటానికి అంత కళాత్మకంగానూ ఉండవు. అయినా భారతదేశం ఆతిథ్యానికి, సేవలకు ఉత్తమ స్మారకంగా ఉన్నది. పైగా వెదురు చాపలు, బొంగులు మట్టి ఇటుకలతో తయారైన ఈ కుటీరం, గాంధీగారు అవలంబించిన నిరాడంబర జీవన విధానాన్ని మన కళ్ళకి కడుతుంది. నాలుగు సంవత్సరాలు ఈ ఆశ్రమం దగ్గరలోనే నివసించడం గొప్ప అనుభూతి నిచ్చింది.
సేవాగ్రాంలో బాపూజీ 1934 నుంచి 1940 వరకు ఆశ్రమం నిర్మించుకొని నివసించాడు. సాధారణ ప్రజలు నివశించే విధంగానే కరెంటు లేకుండా, ఫోన్ సౌకర్యం లేకుండా నిరాడంబర జీవనాన్ని గడిపాడు. బాపూజీ వంటగదిని ఆశ్రమంలో చూడవచ్చు.

ఆఖిరి నివాస్:

గాంధీ ఆశ్రమంలో నిర్మించిన మొదటి గుడిసె ఆఖరి నివాస్. దీని చుట్టూ ప్రార్థనా స్థలం ఉంటుంది. ఇందులో గాంధీజీ వాడిన వెయిటింగ్ మెషీన్ భద్రపరిచారు. దీనిని అప్పట్లో 100 రూపాయలతో నిర్మించారు. 1942 వ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం లో భాగంగా ఇక్కడ నిత్యం సభలు, సమావేశాలు జరిగేవి. ఈ వివరాలు ఇతర వెబ్‌సైట్లు, పుస్తకాల ద్వారా సేకరించడం జరిగింది.
Tags:    

Similar News