అజిత్ ధోవల్ ఇంటివద్ద కలకలం.. ఇంట్లోకి చొరబడేందుకు విఫలయత్నం
బుధవారం జన్ పథ్ లోని అజిత్ దోవల్ నివాసం వద్ద ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ..
జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ ఇంటి వద్ద కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ.. ఇంట్లోకి చొరబడేందుకు యత్నించాడు. ఆ అగంతకుడి కదలికలను గమనించిన పోలీసులు అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం జన్ పథ్ లోని అజిత్ దోవల్ నివాసం వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసుల అదుపులోకి ఉన్న వ్యక్తి తనను వదిలేయాలని, అజిత్ దోవల్ తో పని ఉందంటూ వాగ్వాదానికి దిగాడు. దాంతో అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించి, ప్రాథమిక విచారణ చేశారు.
పోలీసుల విచారణలో అతనొక అద్దెకారు డ్రైవర్ అని పోలీసులు నిర్థారించారు. కాగా.. తొలుత తన శరీరంలో ఎవరో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చారని, అందుకే అలా ప్రవర్తించినట్లు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. ఆ తర్వాత అతని ప్రవర్తనకు, చెప్తున్న సమాధానాలకు పొంతన లేకపోవడంతో వైద్యుల్ని పిలిపించి పరీక్షలు చేయించారు. వైద్యపరీక్షల్లో అతను మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి అని తేలింది. ఆ అగంతకుడిని కర్ణాటకవాసిగా గుర్తించామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.