గిరిజన యువకుడి కాళ్లు కడిగి, క్షమాపణలు కోరిన సీఎం

భోపాల్ లోని తన నివాసానికి గిరిజన యువకుడు దశరథ్ ను పిలిపించిన సీఎం శివరాజ్.. అతనికి జరిగిన అవమానం పట్ల విచారం..

Update: 2023-07-06 12:29 GMT

మధ్యప్రదేశ్ లో గిరిజన యువకుడిపై.. ప్రవేశ్ శుక్లా మూత్ర విసర్జన చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రవేశ్ శుక్లా సెంట్రల్ జైల్ లో ఉండగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ప్రవేశ్ ఇంటిని సైతం కూల్చివేశారు. కాగా.. మూత్రవిసర్జన బాధితుడైన దశరథ్ రావత్ ను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కలిశారు.

భోపాల్ లోని తన నివాసానికి గిరిజన యువకుడు దశరథ్ ను పిలిపించిన సీఎం శివరాజ్.. అతనికి జరిగిన అవమానం పట్ల విచారం వ్యక్తం చేశారు. అనంతరం అతడిని కూర్చోబెట్టి కాళ్లు కడిగి, సన్మానించారు. జరిగిన ఘటనపై క్షమాపణలు కోరారు. ఆపై కొద్దిసేపు అతనితో ముచ్చటించి.. కుటుంబానికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. సీఎం శివరాజ్ సింగ్, ఆదివాసీ యువకుడు కలిసి స్మార్ట్ సిటీలో ఓ మొక్కను నాటారు. అనంతరం దశరథ్ రావత్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎంను కలవడం చాలా సంతోషంగా ఉందని, తన కుటుంబ సభ్యులను కూడా సీఎం కలిసి మాట్లాడారని తెలిపాడు.
కాగా.. సీదీ జిల్లాలో ప్రవేశ్ శుక్లా రావత్ పై మూత్రం పోయగా తీసిన వీడియో.. మూడు నెలల క్రితం జరిగిన ఘటనగా అధికారులు గుర్తించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పాటు.. సీఎం దృష్టికి చేరడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఈ వీడియో తీవ్రదుమారం రేపింది. నిందితుడు ప్రవేశ్ శుక్లా ఇంటిని కూల్చివేయడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ.. అతనికి, అతడి కుటుంబానికి తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సీఎం శివరాజ్ సింగ్.. దశరథ్ కాళ్లు కడిగిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Tags:    

Similar News