విమానంలో ఏసీ పని చేయకపోతే.. అడిగినన్ని టిష్యూ పేపర్లు
విమానంలోకి వెళ్లిన 10 నుంచి 15 నిమిషాల తర్వాత విపరీతమైన వేడి మొదలైంది. సెగలు కక్కుతున్న
విమాన ప్రయాణంలో ఏసీలు పని చేయడం చాలా ముఖ్యం. లేదంటే ఉక్కపోతతో అల్లాడిపోతారు. తాజాగా అలాంటి ఇబ్బందులే ఇండిగో విమానం ప్రయాణీకులకు ఎదురైంది. విమానం లోపల సాధారణ ప్రజలే కాకుండా పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. చాలా మంది తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు. పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్.. ఇండిగో విమానం 6E7261లో చండీగఢ్ నుండి జైపూర్‌కు ప్రయాణిస్తున్నప్పుడు అత్యంత భయంకరమైన అనుభవం ఎదురైందని చెప్పారు. ఎయిర్ కండిషనింగ్ లేకుండా విమానం లోపల కూర్చోబెట్టడం వల్ల విమానంలోని ప్రయాణికులకు 90 నిమిషాలు నరకం అనుభవించారంటూ ఆయన సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.
ఇండిగో విమానం చండీఘడ్ నుంచి జైపూర్ బయలుదేరింది. విమానంలోకి వెళ్లిన 10 నుంచి 15 నిమిషాల తర్వాత విపరీతమైన వేడి మొదలైంది.. సెగలు కక్కుతున్న వాతావరణంలో కూర్చున్నాం.. ఏసీ ఆన్‌లో లేకపోయినా విమానం టేకాఫ్ అయిందని ప్రయాణీకులు వాపోయారు. విమానం బయలుదేరిన దగ్గర నుంచి ప్రయాణం ముగిసే వరకూ ప్రయాణికులందరూ ఏసీ లేక ఇబ్బంది పడాల్సి వచ్చిందని.. ఇంత పెద్ద సమస్యను పట్టించుకున్న వారే లేరని తెలిపారు. అయితే చెమట తుడుచుకోమని.. మా అందరికీ ఎయిర్‌హాస్టస్ బోలెడన్ని టిష్యూ పేపర్లు ఇచ్చిందని అమరీందర్ సింగ్ రాజా అన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI).. విమానయాన సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని అమరీందర్ సింగ్ రాజా కోరారు. ఇండిగో విమానాల్లో 24 గంటల వ్యవధిలో సాంకేతిక లోపం తలెత్తడం మూడోసారి అని నెటిజన్లు చెబుతున్నారు.