పెట్రో బాదుడు ఆగడం లేదు
ఇప్పటి వరకూ 14 సార్లు పెట్రోలు ధరలను పెంచిన చమురు కంపెనీలు లీటరు పెట్రోలు పై దాదాపు 12 రూపాయలు పెంచాయి.
దేశంలో పెట్రోలు ధరలు త్వరలో లీటరు 140 రూపాయలు చేరుకోవడం ఖాయంగా కన్పిస్తుంది. వరసగా 14 రోజుల నుంచి పెట్రోలు ధరలను చమురు సంస్థలు పెంచుతూ వెళుతున్నాయి. గతంలో మాదిరి పది పైసలు, పదిహేను పైసలు కాదు. రోజుకు 90 పైసలు పెంచుతూ వినియోగదారుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నాయి. అదేమంటే అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పెరిగాయని, ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్ లో పెట్రోలు, డీజిల్ ధరలు తక్కువేనని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
మళ్లీ పెంచిన...
తాజాగా లీటరు పెట్రోలు పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచారు. ఇప్పటి వరకూ 14 సార్లు పెట్రోలు ధరలను పెంచిన చమురు కంపెనీలు లీటరు పెట్రోలు పై దాదాపు 12 రూపాయలు పెంచాయి. త్వరలోనే లీటరు పెట్రోలు ధర 140 రూపాయలకు చేరుకుంటుందని చెబుతున్నారు. తాజాగా పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర 119.49 రూపాయలు, లీటరు డీజిల్ ధర 105,49కి చేరింది.