Onion Prices : ఒక్కసారిగా పెరిగిన ఉల్లి ధరలు.. కిలో ఎనభై రూపాయలు.. కొనలేక.. కన్నీళ్లు
ఉల్లి ధరలు అమాంతం పెరిగాయి. ఒక్కసారిగా ధరలు పెరగడంతో వినియోగదారులు కొనుగోలు చేయలేక కన్నీటి పర్యంతమవుతున్నారు
ఉల్లి ధరలు అమాంతం పెరిగాయి. ఒక్కసారిగా ధరలు పెరగడంతో వినియోగదారులు కొనుగోలు చేయలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రతి వంటకంలో ఉల్లి తప్పనిసరి కావడంతో దీని అవసరం వంటింట్లో ఉంది. కర్నూలు మార్కెట్ లో 3,440 రూపాయల క్వింటాల్ కు ధర పలుకుతుంది. కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ లో ఉల్లి దిగుబడి తగ్గడం వల్ల ఉల్లి దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు. ధర పెరుగుతున్నందున ఉల్లి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ, వినియోగదారులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే యాభై వేల ఎకరాలలో ఉల్లి సాగవుతుంది.
అమాంతంగా పెరిగి...
నెల రోజుల క్రితం 25 రూపాయలు పలికింది..ఇప్పుడు కిలో 60 రూపాయల వరకూ చేరింది. కొన్ని చోట్ల ఎనభై రూపాయల వరకూ పలుకుతుంది. త్వరలోనే వందకు చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు వ్యాపారులు. కేవలం ఇరవై రోజుల్లోనే ధరలు రెట్టింపయ్యాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురువడంతో ఉల్లి దిగుబడులు తగ్గాయని చెబుతున్నారు. పండగ సీజన్ కావడంతో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఉల్లి ధరలు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది.
కేంద్రం జోక్యంతో...
అయితే ఉల్లిపాయల ధరలు పెరుగుతుండటంతో దేశ వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఉల్లి ధరలకు కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేసే ప్రయత్నం చేసేందుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 4.70 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయల బఫర్ స్టాక్స్ ను విడుదల చేయాలని నిర్ణయించింది. దీనివల్ల ఉల్లి ధరలు తగ్గే అవకాశముందని ప్రభుత్వం చెబుతుంది. కానీ వ్యాపారులు మాత్రం ఉల్లి వంద దాటే అవకాశముందని చెబుతున్నారు.