అరగంటలో అల్లాడించిన 5 వేలకు పైగా పిడుగులు.. బెంబేలెత్తిపోయిన ఒడిశా వాసులు
ఈ ఘటనలతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పెద్దగా ఆస్తినష్టం జరగలేదు కానీ.. ఎడతెరపి లేకుండా పడిన పిడుగులు హడలెత్తించాయి.
ఒక్క పిడుగు పడితేనే గుండె ఝల్లుమంటుంది. ఏదో తెలియని భయం వస్తుంది. ఈ పిడుగు పాటుకు పంటలు దెబ్బతింటాయి. ఒక్కోసారి మనుషులు, జంతువులు కూడా ప్రాణాలు కోల్పోతాయి. అలాంటిది అరగంట వ్యవధిలో పిడుగుల వర్షం కురిస్తే ఎలా ఉంటుంది ? ఆ ప్రాంత ప్రజల పరిస్థితి ఏంటి ? ఊహకే గుండెల్లో గుబులు పుడుతుంది కదూ. ఒడిశాలోని భద్రక్ జిల్లా బాసుదేవపూర్ లో బుధవారం (మార్చి 29) సాయంత్రం అరగంట వ్యవధిలో ఏకంగా 5,450 పిడుగులు పడ్డాయి.
ఈ పిడుగుల వర్షానికి ఆ గ్రామ ప్రజలు గుండెను అరచేతబట్టి.. బిక్కుబిక్కుమంటూ గడిపారు. వరుసగా పడిన పిడుగుల శబ్దాలతో భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పెద్దగా ఆస్తినష్టం జరగలేదు కానీ.. ఎడతెరపి లేకుండా పడిన పిడుగులు హడలెత్తించాయి. పిడుగుల ఘటనపై స్పందించిన గోపాల్‌పూర్ డాప్లార్ రాడార్ కేంద్రం (ఐఎండీ) అధికారులు.. ఇలా పిడుగులు పడటం కొత్తేమీ కాదన్నారు.
గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని సూచించారు. క్యుములోనింబస్ మేఘాలు రాపిడికి గురైనప్పుడు ఇటువంటివి జరుగుతుంటాయని తెలిపారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పిడుగులు కూడా పడొచ్చని, ప్రజలు వీలైనంత వరకూ బయటకు రావొద్దని హెచ్చరించారు.