కేరళలో టమోటా ఫీవర్ కలకలం.. 80కి పైగా కేసులు
కేరళలో కొత్త రకం ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయి. చిన్నారులకు జ్వరం, ఒంటిపై మచ్చలు వస్తున్నాయి.;
కేరళలో టమోటా ఫీవర్ కలకలం రేపుతోంది. ఐదేళ్లలోపు చిన్నారులకు కొత్తరకం ఫీవర్ సోకుతోంది. ఇప్పటికే సుమారు 80కిపైగా కేసులు నమోదవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్నారుల ఒంటిపై ఎర్రటి మచ్చలు, దురదతో కూడిన జ్వరం వస్తోంది. టమోటా ఫీవర్ వైరల్ ఫీవరా? లేక చికెన్‌గున్యా, డెంగ్యూ జ్వరాల తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అని అధికారులు ఆరా తీస్తున్నారు.
కేరళలో కొత్తరకం ఫ్లూ లక్షణాలతో పొరుగున ఉన్న తమిళనాడు అప్రమత్తమైంది. కేరళ తమిళనాడు బోర్డర్‌లో వైద్యులతో పరీక్షలు నిర్వహిస్తోంది. ఒంటిపై మచ్చలు, జ్వరంతో ఉన్న చిన్నారులతో రాష్ట్రంలోకి వచ్చే వారిని గుర్తిస్తోంది. అక్కడే వారికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు వైద్యాధికారులతో కూడిన 24 మంది బృందం బోర్డర్‌లో చిన్నారులకు పరీక్షలు నిర్వహిస్తోంది.
టమోటా ఫీవర్ లక్షణాలివే..
1) తీవ్రమైన జ్వరం
2) డీ హైడ్రేషన్
3) చర్మంపై మచ్చలు, దురద
4) చేతులు, కాళ్లపై చర్మం రంగుమారడం
5)బొబ్బలు రావడం
6)వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి
7)జలుబు, దగ్గు, తుమ్ములు
8) నీరసం, ఒళ్లునొప్పులు