పంజాబ్ లో ఉద్రిక్తతలు.. మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలు బంద్

పటియాలాలో పరిస్థితిని అదుపుచేసేందుకు అదనపు బలగాలను మోహరించారు. అయినప్పటికీ అక్కడ పరిస్థితి అదుపులోకి రాకపోవడమే..

Update: 2022-04-30 07:16 GMT

పటియాలా : పంజాబ్ రాష్ట్రంలోని పటియాలాలో నిన్న కాళీమందిర్ ప్రాంతంలో శివసేన నేతలు, ఖలిస్థాన్ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణలు తీవ్రఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఖలిస్థాన్ మ‌ద్ద‌తు దారులు, శివ‌సేన కార్య‌క‌ర్త‌లు నిన్న పోటాపోటీగా ర్యాలీలు చేసిన నేపథ్యంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు కత్తులతో, రాళ్లతో దాడి చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

పటియాలాలో పరిస్థితిని అదుపుచేసేందుకు అదనపు బలగాలను మోహరించారు. అయినప్పటికీ అక్కడ పరిస్థితి అదుపులోకి రాకపోవడమే కాకుండా.. వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమయ్యారని భావిస్తూ.. ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై పంజాబ్ సర్కాలు చర్యలకు ఉపక్రమించింది. పటియాలా రేంజ్ ఐజీతో పాటు ఎస్‌ఎస్‌పీ, ఎస్‌పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
కాగా.. పటియాలాలో ఉద్రిక్త పరిస్థితులున్న నేపథ్యంలో నిన్న రాత్రి 7 గంటల నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ విధించారు. ఇప్పటికి కూడా పరిస్థితులు అలాగే ఉండటంతో సాయంత్రం 6 గంటల వరకూ వాయిస్ కాల్స్ మినహా.. మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేస్తున్నట్లు భగవంత్ మాన్ సర్కార్ ప్రకటించింది.




Tags:    

Similar News