Petrol Diesel Price: గుడ్ న్యూస్.. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం
భారత్ లో కూడా భారీగా పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గుతాయని
పెట్రోల్-డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని దేశ ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు. జీఎస్టీ కిందకు తీసుకుని వస్తే కూడా ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని పలువురు నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తాము ఇంధన ధరలను జీఎస్టీ కిందకు తీసుకుని రావడానికి సిద్ధంగానే ఉన్నామని, అందుకు రాష్ట్రాల సమ్మతి అవసరమని తెలిపారు. అయితే త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రపంచ మార్కెట్ లో ముడి చమురు ధరలు ఎక్కువ కాలం పాటు తక్కువ ధరలోనే ఉంటే భారత్ లో కూడా భారీగా పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గుతాయని అంటున్నారు. ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఇకపై ముడిచమురు ధర ఎక్కువ కాలం తక్కువ ధరలోనే ఉంటే ఇంధన ధరలను తగ్గించే అంశాన్ని చమురు కంపెనీలు పరిశీలిస్తాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ తెలిపారు. క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో మూడేళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయి. 2021 డిసెంబర్ తర్వాత బ్యారెల్ చమురు ధర రెండు రోజుల క్రితం 70 డాలర్ల దిగువకు చేరింది. ప్రస్తుతం క్రూడాయిల్ బ్యారెల్ ధర 72 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇలాగే కొనసాగితే భారత్‌లో చమురు ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని పంకజ్ జైన్ వెల్లడించారు. అనేక రాష్ట్రాల్లో ప్రజలు పెట్రోల్‌కు రూ. 100 పైగా చెల్లిస్తున్నారు. డీజిల్ ధరలు లీటర్‌కు రూ. 90 కంటే ఎక్కువ ఉన్నాయి.