నేడు 5 వందేభారత్ రైళ్లు ప్రారంభం.. ఏయే ప్రాంతాల్లో అంటే..

తాజాగా మరో ఐదు రూట్లలో ఈ సెమీ-హైస్పీడ్ రైళ్ల సర్వీసులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ..

Update: 2023-06-27 00:45 GMT

five vande bharat trains

కేంద్ర రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఇప్పటికే 17 రూట్లలో పరుగులు పెడుతున్నాయి. ఈ రైలులో ప్రయాణించాలంటే కాస్త ధర ఎక్కువే అయినప్పటికీ.. ప్రయాణికులు వందేభారత్ రైలులో ప్రయాణించేందుకు ఇష్టపడుతుండటం విశేషం. తాజాగా మరో ఐదు రూట్లలో ఈ సెమీ-హైస్పీడ్ రైళ్ల సర్వీసులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ఉదయం 10.30 గంటలకు వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తారని పీఎంఓ వెల్లడించింది.

మొత్తం ఐదు వందేభారత్ రైళ్లలో.. రెండు రైళ్లు మధ్యప్రదేశ్ నుంచి ప్రారంభం కానుండగా.. మరో మూడు రైళ్లు కర్ణాటక, బీహార్, గోవాల నుంచి ప్రారంభం కానున్నాయి. వీటితో కలిపి దేశంలో సేవలందించే వందేభారత్ రైళ్ల సంఖ్య 24కు చేరనుంది.
కొత్తగా ప్రారంభించే రైళ్లు ప్రయాణించేది ఈ మార్గాల్లోనే..
మధ్యప్రదేశ్ లో భోపాల్ నుంచి ఢిల్లీకి ఇప్పటికే ఒక వందేభారత్ రైలు నడుస్తుండగా.. నేడు రాణి కమలాపతి - జబల్పూర్, ఖజురహో-భోపాల్-ఇండోర్ ల మధ్య రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. రాణి కమలాపతి - జబల్పూర్ మధ్య నడిచే వందేభారత్ రైలు.. మహాకౌసల్ నుంచి సెంట్రల్ రీజియన్ వరకూ ప్రయాణికులకు సేవలందించనుంది. బెహ్రాఘాట్, పచ్ మడి, సాత్పూర తదితర పర్యాటక ప్రాంతాల మీదుగా ప్రయాణించే ఈ రైలు.. సాధారణ సర్వీసుల కంటే 30 నిమిషాల ముందుగానే ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తుంది.
అలాగే ఖజురహో-భోపాల్-ఇండోర్ ల మధ్య ప్రారంభమయ్యే వందేభారత్.. ఇండోర్ లోని మాల్వా నుంచి ఖజురహో లోని బుందేల్ ఖండ్ నుంచి సెంట్రల్ భోపాల్ ను కలుపుతూ వెళ్లనుంది. మహాకాళేశ్వర్, మండు, మహేశ్వర్, ఖజురహో, పన్నా తదితర పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవారికి వందేభారత్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. గతంలో సేవలందించిన రైళ్లతో పోలిస్తే.. వందేభారత్ రెండున్నర గంటల ముందుగానే గమ్యస్థానాలకు చేరుకుంటుంది.
మడ్ గావ్ - ముంబై ల మధ్య ప్రారంభమయ్యే వందేభారత్ రైలు.. గోవాలోని తొలి సెమీ హైస్పీడ్ రైలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి గోవాలోని మడ్ గావ్ స్టేషన్ల మధ్య రాకపోకల్ని కొనసాగిస్తుంది. గతంలో ఈ మార్గంలో నడిచిన స్పీడ్ రైళ్లతో పోలిస్తే.. వందేభారత్ రైలు.. గంట సమయాన్ని ఆదా చేస్తుంది.
ధార్వాడ్ - బెంగళూరు ల మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్.. కర్ణాటకలోని ధార్వాడ్, హుబ్బళ్లి, దేవనగిరి పట్టణాలను బెంగళూరుకు కలుపుతూ సర్వీసులను అందిస్తుంది. ఈ కొత్త సర్వీసుతో పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. ప్రయాణికులకు అరగంట సమయం ఆదా అవుతుంది. కర్ణాటకలో ప్రారంభమవుతున్న రెండవ వందేభారత్ రైలు ఇది. ఇప్పటికే చెన్నై-బెంగళూరు- మైసూరుల మధ్య వందేభారత్ రైలు సర్వీసులు అందిస్తోంది.
ఇక హతియా-పాట్నా
మధ్య నడవనున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్.. ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాలను కలుపుతూ రాకపోకలు సాగిస్తుంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఏర్పాటయ్యే తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఇదే. పాట్నా - రాంచీల మధ్య వందేభారత్ రైలు సర్వీసులతో పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారులకు గంటన్నర సమయం ఆదా అవుతుంది.










Tags:    

Similar News