హోంమంత్రి అమిత్ షా పై పోలీస్ కేసు

ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా తప్పుడు వ్యాఖ్యలు చేశారని, ప్రతిపక్ష పార్టీని అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నించారంటూ..

Update: 2023-04-27 06:37 GMT

amit shah comments on congress

కర్ణాటకలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడే కొద్దీ అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సుర్జేవాలా, డా. పరమేశ్వర్, డీకే శివకుమార్ తాజాగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా తప్పుడు వ్యాఖ్యలు చేశారని, ప్రతిపక్ష పార్టీని అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నించారంటూ బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ లో బుధవారం ఫిర్యాదు చేశారు.

అనంతరం కాంగ్రెస్ నేత సుర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతాయని అమిత్ షా అన్నారని తెలిపారు. అలాగే.. పీఎఫ్ఐ సంస్థపై నిషేధం ఎత్తేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని తప్పు వ్యాఖ్యలు చేశారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి కర్ణాటకలో మతసామరస్యాన్ని చెడగొట్టి, కాంగ్రెస్ కు దురుద్దేశాలను అంటగడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం బాగాల్‌‌కోట్‌లో జరిగిన ఓ ర్యాలీలో అమిత్ షా ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కు పొరపాటు ఓట్లువేస్తే.. అవినీతిని మునుపెన్నడూ చూడని స్థాయిలో పెంచినట్టేనని అమిత్ షా పేర్కొన్నారు.





Tags:    

Similar News