తెలుగు రాష్ట్రాలకు పోలీస్ పతకాలు.. తెలుగు రాష్ట్రాలకు 32 పతకాలు
ఆంధ్రప్రదేశ్ నుంచి అదనపు డీజీ అతుల్ సింగ్, 6వ బెటాలియన్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ సంగం వెంకటరావు, తెలంగాణ నుంచి
రేపు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సైనిక, పోలీస్ అధికారులకు పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 901 మంది పోలీసులకు పతకాలను అందజేయనుంది. వారిలో 32 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన పోలీసులున్నారు. ఏపీ నుండి 17 మంది, తెలంగాణ నుండి 15 మంది పతకాలను అందుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అదనపు డీజీ అతుల్ సింగ్, 6వ బెటాలియన్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ సంగం వెంకటరావు, తెలంగాణ నుంచి అదనపు డీజీ అనిల్ కుమార్, 12వ బెటాలియన్ అదనపు కమాండెంట్ రామకృష్ణ రాష్ట్రపతి పతకాలను అందుకోనున్నారు. అలాగే ఏపీలో 15 మంది, తెలంగాణలో 13 మంది విశిష్ఠ సేవా పతకాలను అందుకోనున్నారు.
కాగా.. ఈ ఏడాది కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా 140 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (పీఎంజీ),93 మంది పోలీసులకు రాష్ట్రపతి పోలీసు పతకాలు (పీపీఎం), 668 మందికి పోలీస్ విశిష్ట సేవా (పోలీసు మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకాలను ప్రకటించింది. గ్యాలంట్రీ పతకాలు వచ్చినవారిలో అత్యధికంగా 48 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు ఉన్నారు. మహారాష్ట్ర నుండి 31 మంది, జమ్మూ కశ్మీర్ నుండి 25, ఝార్ఖండ్ నుండి 9, ఢిల్లీ నుండి 7, ఛత్తీస్ గఢ్ నుండి 7గురు పోలీసులకు గ్యాలంట్రీ పురస్కారాలు దక్కాయి. ఈ ఏడాది అత్యున్నత రాష్ట్రపతి పోలీసు మెడల్ ఫర్ గ్యాలంట్రీ (పీపీఎంజీ) పురస్కారాన్ని ఎవరికీ ప్రకటించలేదు.