Polling : పోలింగ్ ప్రారంభం... మావోయిస్టులు బహిష్కరణ పిలుపుతో
నేడు మిజోరాం, ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది
నేడు తొలి విడత ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మిజోరాం, ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే ఆరంభించారు. మిజోరాంలో ఒకే విడతలోనూ, ఛత్తీస్‌గడ్ లో రెండు విడతలుగా పోలింగ్ ను నిర్వహించనున్నారు. తొలివిడతగా మిజోరాంలో ఉన్న మొత్తం నలభై నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఐదు గంటల వరకూ జరగనుంది. తొలివిడతలో ఛత్తీస్‌గడ్ లో జరిగే పన్నెండు నియోజకవర్గాలను సమస్యాత్మకమైన కేంద్రాలుగా గుర్తించారు.
భారీ బందోబస్తు...
అయితే ఛత్తీస్‌గడ్ మాత్రం రెండు విడతలుగా జరుగుతాయని ముందుగానే ఎన్నికల కమిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఛత్తీస్‌గడ్‌లో ఇరవై స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. అయితే మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ ఎన్నికలను నిర్వహించేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటీవల బీజేపీ నేతను నక్సల్స్ హత్య చేయడంతో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వారిని క్షుణ్ణంగా పరిశీలించి పంపుతున్నారు. అయితే ఛత్తీస్‌గడ్ లో మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో అదనపు బలగాలను మొహరించారు.