ఇదెక్కడి విడ్డూరం.. రావణుడి తలలన్నీ దగ్ధం కాలేదని ?
చత్తీస్ గఢ్ లోని ధంతరిలోనూ దసరా రోజున రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావణుడి పది తలలు పూర్తిగా..
ప్రతి ఏటా విజయదశమి సందర్భంగా 10 తలలున్న రావణుడి బొమ్మలను దహనం చేయడం సంప్రదాయంగా వస్తోంది. రావణ దహనం పేరుతో దేశవ్యాప్తంగా ఈ తంతు జరుగుతోంది. ఈ కార్యక్రమాల్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. విజయదశమి రోజున రావణ సంహారం జరగడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. చత్తీస్ గఢ్ లోని ధంతరిలోనూ దసరా రోజున రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావణుడి పది తలలు పూర్తిగా దగ్ధంకాలేదని అధికారులు గుర్తించారు.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ధంతరి మున్సిపాలిటీ ఉన్నతాధికారులు.. అందుకు కారణం ఓ క్లర్క్ అని గుర్తించి, అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆ క్లర్క్ అలసత్వం కారణంగానే రావణుడి పది తలలు దహనం కాలేదని నిర్ధారించారు. రావణుడి బొమ్మ తయారీ ఖర్చు బిల్లులను కూడా నిలిపి వేశారు. రావణుడి తలలు ఎందుకు కాలిపోలేదో లిఖితపూర్వకంగా తెలియజేయాలని మరో నలుగురు అధికారులకు నోటీసులు జారీ చేశారు. రావణుడి తలలు పూర్తి దగ్ధం కాకపోవడానికి కారణమేదైనా కావచ్చు కానీ.. క్లర్క్ పై వేటు వేయడంపై పలువురు అభ్యంతరం తెలిపారు. ఇది తెలిసిన ప్రజలు ఇదెక్కడి విడ్డూరం అని చెవులు కొరుక్కుంటున్నారు.