సాయంచేసినందుకు చెంపదెబ్బలు.. ఆగ్రహించిన సెక్యూరిటీ గార్డులు

వరుణ్ నాథ్ లిఫ్ట్ నుంచి బయటకు రాగానే సెక్యూరిటీ గార్డును, లిఫ్ట్ మ్యాన్ ను చెంపదెబ్బలు కొట్టాడు. దీంతో ఆగ్రహించిన దక్లోజ్;

Update: 2022-08-30 06:50 GMT

ఎవరైనా ఆపదలో ఉండగా.. అడిగినా, అడగకపోయినా సహాయం చేస్తే.. కృతజ్ఞతలు చెప్తారు. కానీ ఓ వ్యక్తి తనకు సాయం చేసిన వ్యక్తిపై చేయిచేసుకున్నాడు. ఈ ఘటనపై సెక్యూరిటీ గార్డులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో జరిగింది. గురుగ్రామ్ లోని ద క్లోజ్ నార్త్ సొసైటీలో నివాసముంటున్న వరుణ్ నాథ్ 14వ అంతస్తు నుంచి లిఫ్ట్ లో కిందకి వస్తున్నాడు. ఆ సమయంలో లిఫ్ట్ ఆగిపోయింది. సహాయం కోసం లిఫ్ట్ లో ఉన్న ఇంటర్ కామ్ ద్వారా సెక్యూరిటీ గార్డుకు సమాచారమిచ్చాడు. సెక్యూరిటీ గార్డ్ అశోక్, లిఫ్ట్ మ్యాన్ తో కలిసి లిఫ్ట్ ఆగిన ప్రాంతానికి చేరుకుని, ఐదునిమిషాలు కష్టపడి వరుణ్‌ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

వరుణ్ నాథ్ లిఫ్ట్ నుంచి బయటకు రాగానే సెక్యూరిటీ గార్డును, లిఫ్ట్ మ్యాన్ ను చెంపదెబ్బలు కొట్టాడు. దీంతో ఆగ్రహించిన దక్లోజ్ నార్త్ సొసైటీలోని సెక్యూరిటీ గార్డులంతా సమ్మెకు దిగారు. సహాయం చేసినందుకు అభినందించకపోయినా ఫర్వాలేదు కానీ.. కొట్టడమేంటని ప్రశ్నించారు. అశోక్, లిఫ్ట్ మ్యాన్ పై చేయి చేసుకున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తతంగమంతా సొసైటీలోని లిఫ్ట్ దగ్గర అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లంతా వరుణ్ నాథ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన తర్వాత సొసైటీలోని సెక్యూరిటీ గార్డులంతా పని చేయడం మానేశారు. సొసైటీ వాసులకు తమ సేవలను అందించేందుకు తాము రాత్రింబవళ్లు కష్టపడుతున్నామని, కొంతమంది మాత్రం తమను బానిసలుగా భావిస్తున్నారని సెక్యూరిటీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు వరుణ్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో గురుగ్రామ్ పోలీసులు నిందితుడు వరుణ్ నాథ్‌పై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 323 (బాధ కలిగించడం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు.


Tags:    

Similar News