మరో ఏడుగురు.. 48 గంటల్లో 31 మంది మృతి

గత 48 గంటల్లోనే 31మంది మృతి చెందారు. ఇంకా 71 మంది రోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుంది..

Update: 2023-10-04 04:56 GMT

మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాలు కొనసాగుతున్నాయి. గత 48 గంటల్లోనే 31మంది మృతి చెందారు. ఇంకా 71 మంది రోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరణాలకు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, మందుల కొరత కారణం కాదని.. రోగులకు సరైన వైద్యం అందించినా వారు కోలుకోలేదని చెప్పారు ఆస్పత్రి డీన్ శామ్‌రావ్‌. ప్రభుత్వ ఆస్పత్రిలో ఏకంగా 31మంది చనిపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రచారం తప్పా.. ప్రజల కోసం బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమంటూ మండిపడ్డారు. నాందేడ్ ఆస్పత్రి ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్‌లో ఘాటుగా స్పందించారు. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో శివసేన ఎంపీ హేమంత్‌ పాటిల్‌ శంకర్రావ్‌ చవాన్‌ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు.

అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే ఆస్పత్రి డీన్‌ శ్యామ్‌రావ్ వాకోడేను పిలిపించి అపరిశుభ్రతపై గట్టిగా నిలదీశారు. అంతటితో ఆగకుండా డీన్‌తోనే మరుగుదొడ్లను శుభ్రం చేయించారు. ఎంపీ పైపుతో గోడలపై నీళ్లు కొడుతుండగా.. డీన్‌ వైపర్‌తో మరుగుదొడ్లను శుభ్రం చేశాడు. ఆస్పత్రి డీన్‌తో ఎంపీ మరుగుదొడ్లు కడిగించడంపై వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎంపీ తీరుపై మిశ్రమంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

కాగా, వరుస మరణాల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ పై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ''ఇది చాలా బాధాకరం. ఇలాంటి ఘటనే ఆగస్టు 18న థానె ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. నాందేడ్ మరణాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి'' అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ''పబ్లిసిటీ కోసం బీజేపీ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుంది. కానీ పిల్లలకు మెడిసిన్ కొనేందుకు డబ్బుల్లేవా?'' అని రాహుల్ గాంధీ ట్విట్టర్​లో ప్రశ్నించారు.

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: సీఎం

నాందేడ్ ఆస్పత్రిలో మరణాలకు సిబ్బంది, మందుల కొరత కారణం కాదని సీఎం ఏక్ నాథ్ షిండే చెప్పుకొచ్చారు. ఆస్పత్రిలో సరిపడా సిబ్బందితో పాటు మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మంగళవారం ముంబైలో మీడియాతో షిండే మాట్లాడారు. ''ఇది చాలా బాధాకరం. ఈ ఘటనను మేం సీరియస్ గా తీసుకున్నం. దీనిపై విచారణకు ఆదేశించాం. ఒకవేళ ఎవరిదైనా తప్పుంటే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం'' అని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News