మార్చి 23 చరిత్రలో మర్చిపోలేనిది.. ఉరితాడును నవ్వుతూ ముద్దాడిన వీరుడు
భారతదేశ చరిత్రలో షహీద్ భగత్‌సింగ్ చెరగని ముద్రవేశారు. నూనూగు మీసాల వయస్సులోనే ప్రాపంచిక విషయాలపై శాస్త్రీయ దృక్పథం..
భారతదేశ చరిత్రలో షహీద్ భగత్‌సింగ్ చెరగని ముద్రవేశారు. నూనూగు మీసాల వయస్సులోనే ప్రాపంచిక విషయాలపై శాస్త్రీయ దృక్పథం కలిగిన మహోన్నత వ్యక్తిగా అతడ్ని కీర్తిస్తారు. 23 ఏళ్లకే దేశ దాస్యవిముక్తి కోసం నవ్వుతూ ఉరితాడును ముద్దాడిన ఆ మహావీరుడి జీవితం చరిత్రకే ఆదర్శంగా నిలిచారు. ఈ సంద్భంగా నేటి తరానికి ఆయన జీవితం అందించే సందేశం. మార్చి23, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను బ్రిటీషు ప్రభుత్వం ఉరితీసిన రోజు.
1931, మార్చి 23 రాత్రి నుంచే లాహోర్ సెంట్రల్ జైలు బయట వందలాది మంది ప్రజలు బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అక్కడే కాదు దేశవ్యాప్తంగా భగత్‌సింగ్ ఉరితీతను వ్యతిరేకిస్తూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేవరకొండలో ఆంధ్ర మహాసభ నిర్వహించిన ద్వితీయ సభలో రావి నారాయణరెడ్డి తదితర ప్రముఖులు కలిసి భగత్‌సింగ్‌కు ఉరిశిక్ష విధించాలన్న తీర్పును వ్యతిరేకిస్తూ ప్రసంగించారు. దాంతో ఆ సంస్థ సభలు నిర్వహించుకునేందుకు రెండేళ్ల పాటు అనుమతించలేదు. ఈ విషయాలు 'గోల్కొండ' పత్రికలోనూ, నారాయణరెడ్డి వ్యాసాల ద్వారా స్పష్టమతున్నాయి.
ఆవేశం కాదు.. అపారమైన జ్ఞానం..
భగత్ సింగ్‌పై రకరకాల అపోహాలు నాడు, నేడు ప్రచారంలో ఉన్నాయి. 23 ఏళ్ల వయస్సులో ప్రాణాలంటే అంత లెక్కలేని తనం. అంతా కుర్ర ఆవేశం.. అతను ఒక తీవ్రవాది కూడా.. ఇలా రకరకాలుగా భగత్‌సింగ్ గురించిన అపోహలు వచ్చాయి. గత కేంద్ర ప్రభుత్వం ఆయనను ఒక తీవ్రవాదిగా ముద్రవేసే ప్రయత్నం చేసింది. భగత్‌సింగ్ వ్యక్తిత్వాన్ని.. ఆయన భావాలు, దృక్పథం.. సమాజాన్ని ఆయన అర్థం చేసుకున్న విధానం.. జీవితం పట్ల, ప్రాణాల పట్ల ఆయనకున్న అభిప్రాయాలు ఏమిటో వారి మిత్రుడు శివవర్మ రాసిన 'సంస్మృతులు'లో వ్యక్తీకృతమవుతాయి. గాంధీ నాయకత్వంలో జరుగుతున్న స్వతంత్ర పోరాటం రాజీ ధోరణిలో సాగుతోందని, అది మంచిది కాదని చెప్పిన తొలి వ్యక్తి భగత్‌సింగ్. బ్రిటీషు పాలకుల్ని వెళ్లగొట్టడం మాత్రమే కాదు, ఆ తర్వాత దేశంలో చోటు చేసుకునే దోపిడీలను నిర్మూలించాలని చాటిన వ్యక్తి భగత్‌సింగ్. ఆయన అసాధారణ రాజకీయ సైద్ధాంతిక అవగాహన ఉన్న వ్యక్తిగా వారి రచనలు స్పష్టం చేస్తాయి. శాస్త్రీయ దృక్పథాన్నే పంథాగా మార్చుకున్న మానవతావాది.
సుఖ్‌దేవ్ రాసిన లేఖకు భగత్‌సింగ్ సమాధానం..
జైలుశిక్ష అనుభవిస్తున్న సమయంలో యావజ్జీవ శిక్ష విధిస్తారని భావించిన సుఖ్‌దేవ్ 'నాలుగు గోడల మధ్య బతకడం కన్నా ఆత్మహత్య చేసుకుని చావడం నయం' అంటూ రాసిన లేఖకు, భగత్‌సింగ్ రాసిన సమాధానం... 'ఆత్మహత్య ఆలోచన ప్రగతి నిరోధక చర్య. పిరికి చర్య కూడా! మనం నవ్వుతూ ఉరితాడును కౌగిలించుకుంటున్నాం అంటే ప్రాణాలపై ఆశలేదని కాదు.. మన దేశాన్ని బానిసత్వం నుంచి విముక్తి చేయడం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయం అని అర్థం. ఒకవేళ మన జీవితమంతా జైలు గోడల మధ్య సాగాల్సి వచ్చినా, ఇక్కడి నుంచే మన పోరాట మార్గాన్ని కొనసాగిస్తాం.' జైల్లోని రాజకీయ ఖైదీల హక్కుల కోసం 114 రోజులు నిరాహార దీక్ష చేసి, నిర్బంధంలోనూ పోరాట స్ఫూర్తిని రగిలించాడు. 'ప్రేమ అంటే జంతు ప్రవృత్తితో కూడిన వ్యామోహం కాదు. నైతిక విలువలు, సంస్కృతిపై ఆధారపడ్డ గొప్ప అనుభూతి. అది ఎన్నడూ మనిషిని దిగజార్చదు. ప్రతి మనిషి తప్పనిసరిగా లోతైన ప్రేమ భావనలు కలిగి ఉండాలి..' అంటూ ఓ లేఖలో రాశారు భగత్ సింగ్. రెండు పదుల వయసులోనే ప్రేమను నిర్వచించిన భగత్‌సింగ్ మానసిక పరిణితి ఎంత గొప్పదో ఆ మాటల్లో అవగతమవుతోంది.