ఢిల్లీ డిప్యూటి సీఎం, ఆప్ కీలక నేత మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి సోమవారం ఉదయం 11గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సిసోడియాతో పాటు ఈ కేసులో మరో నిందితుడి హైదరాబాద్‌కు చెందిన రామచంద్రపిళ్లెకి సైతం సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆయనను కూడా సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
దేశ రాజధానికి ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో జరిగిన అవినీతి ఆరోపణలపై విచారణ నిమిత్తం విచారణకు సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సోమవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముందు హాజరుకానున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో తమ ముందు హాజరు కావాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడిని దర్యాప్తు సంస్థ కోరింది. సిసోడియా ట్విట్టర్‌లో సీబీఐపై విమర్శలకు దిగారు. "నా ఇంట్లో 14 గంటల పాటు సీబీఐ దాడులు నిర్వహించింది.. ఏమీ బయటకు రాలేదు.. నా బ్యాంక్ లాకర్‌ను వెతికారు.. అందులో ఏమీ బయటకు రాలేదు.. మా గ్రామంలో ఏమీ కనిపించలేదు.. ఇప్పుడు ఉదయం 11 గంటలకు సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కు నన్ను పిలిచారు. వెళ్లి నా పూర్తి సహకారం అందిస్తాను.సత్యమేవ జయతే'' అని ట్వీట్ చేశారు.
సిసోడియాను సోమవారం అరెస్టు చేస్తారని ఆప్ పేర్కొంది. గుజరాత్‌లో బీజేపీతో ఆప్ కు ప్రత్యక్ష పోటీ ఉండడంతో.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు ప్రారంభించినట్లు ఆరోపించింది. ''జైలు కడ్డీలు, ఉరి భగత్ సింగ్ దృఢ సంకల్పానికి అడ్డుకట్ట వేయలేకపోయాయి.. ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం. మనీష్, సత్యేందర్ నేటి భగత్ సింగ్ లు. 75 ఏళ్ల తర్వాత పేదలకు మంచి విద్యను అందించిన విద్యాశాఖామంత్రి దేశానికి లభించారు. ఉజ్వల భవిష్యత్తు కోసం.. కోట్లాది మంది పేదల ప్రార్థనలు మీ వెంట ఉన్నాయి'' అని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు.