నేడు అఖిలపక్షం.. అజెండా బయటపెడతారా?
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలోనే ఈ ప్రత్యేక సమావేశాల అజెండా బయటకు రానుంది. ఇప్పటి వరకూ ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంటు సమావేశాల అజెండా తెలియలేదు. గోప్యంగా ఉంచారు. జమిలి ఎన్నికలని కొందరు, కామన్ సివిల్ కోడ్ ను ఆమోదించుకోవడానికి అని మరికొందరు ఇలా అనేక ఊహాగానాలు వినిపించాయి.
కొత్త భవనంలో...
అయితే ఈ సమావేశాల్లో ఏ ఏ అంశాలు ఉండబోతున్నాయన్నది ఈ రోజు జరిగే అఖిలపక్ష సమావేశంలో తేలనుంది. న్యాయవాదుల సవరణ బిల్లు, పత్రికల బిల్లు వంటివి కూడా ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయి. మహిళ రిజర్వేషన్ బిల్లు కూడా ఈ సమావేశాల్లో వచ్చే అవకాశముందన్న ప్రచారం జరుగుతుంది. ఈ ఉత్కంఠలకు ఈరోజు తెరపడనుందా? రేపటి వరకూ ఆగాలా? అన్నది చూడాల్సి ఉంది. జీ 20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించడంతో అభినందనలతో కూడిన తీర్మానం కూడా ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టే అవకాశముంది. విపక్షాలు కూడా అనేక ప్రజా సమస్యలపై ఆందోళన చేయడానికి రెడీ అవుతున్నాయి.